calender_icon.png 23 January, 2026 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్చి అమ్ముకునేదెట్లా?

23-01-2026 12:15:48 AM

మానుకోట, కేసముద్రం మార్కెట్లో ప్రారంభించని మిర్చి కొనుగోళ్ళు 

మహబూబాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): మిర్చి పండించిన రైతులు పంట చేతికి వస్తుండడంతో మిర్చి అమ్ముకోవడానికి మార్కెట్లలో మిర్చి కొనుగోళ్ళు ప్రారం భించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్, కేసముద్రం వ్యవ సాయ మార్కెట్లలో మిర్చి సీజన్ ప్రారంభమైనప్పటికీ మిర్చి కొనుగోల్లను ఇప్పటివర కు చేపట్టలేదు. మిర్చి మినహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను యధావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఈ రెండు మార్కెట్లలో జనవరి నుండి ఏప్రిల్, మే నెలాఖరు వరకు మిర్చి కొనుగోళ్ళు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

మహబూబాబాద్ జిల్లాలో 4.55 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, అందులో ఈ ఏడాది 52 వేల ఎకరాల వరకు మిర్చి పంట సాగు చేశారు. గత రెండేళ్లతో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన మిర్చి పంట ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడద పెరిగిపోవడం వల్ల ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతు లు చెబుతున్నారు.

గత ఐదేళ్లతో పోలిస్తే జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిందని, ఇప్పుడు దిగుబడి కూడా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పెట్టుబడులు పెరిగిపోవడం, ఆశించిన దిగుబడి కాకపోవడం, 2023 నుంచి మిర్చి ధర తగ్గిపోవడంతో ఈసారి విస్తీర్ణం కూడా తగ్గడం వల్ల మహబూబాబాద్ జిల్లాలో మిర్చి పంట నిరాశ జనకంగా మారిందని రైతులు చెబుతున్నారు. 

పెరుగుతున్న ధర..!

మహబూబాబాద్ జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గడం తో పాటు దిగుబడి కూడా ఆశించినంతగా రాకపోవడం, ఇతర ప్రాంతా ల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ఈసారి మిర్చి ధర అమాంతం పెరిగిపోవడానికి కారణంగా చెబుతున్నారు. మిర్చి పంట దిగుబ డులు ఇప్పుడిప్పుడే రైతుల చేతి కంద వస్తున్నాయి. మిర్చి పంట దిగుబడి ప్రారం భంలోనే క్వింటాలకు 20వేలకు మించడం తో రైతులు తమ కష్టానికి ఫలితం దక్కిందనే ఆశాభావంతో ఉన్నారు.

తేజ మిర్చి రకం సాగు అధికం

మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా తేజ మిర్చి రకం సాగు చేయడం జరిగింది. ఈ మిర్చికి ఇప్పుడు క్వింటాలుకు 20 వేలకు పైగా ధర లభిస్తుందడంతో రైతులు కొంత ఇ బ్బందుల నుండి బయటపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

మిర్చి కొనుగోళ్ళు ప్రారంభించాలి

మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో మిర్చి కొనుగోళ్ళు ప్రా రంభించకపోవడంతో రైతులు ప్రస్తుతం ధర పెరగడం వల్ల మిర్చి విక్రయానికి ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మిర్చిని అక్కడికి తీసుకు వెళ్లడానికి రవాణా చార్జీలతోపాటు వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ధర పెరగడం ఆనందంగా ఉన్నప్పటికీ , అందుబాటులో మిర్చి విక్రయించుకునే పరిస్థితి లేక ధర పెరిగినా రవాణా ఖర్చులు పెరగడం వల్ల సంతోషం లేకుండా పోయిందని చెప్తున్నారు. వెంటనే కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లలో మిర్చి కొనుగోళ్ళు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

వారం రోజుల్లో మిర్చి కొనుగోళ్ళు ప్రారంభిస్తాం

మిర్చి దిగుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ప్రతి సంవత్సరం జనవరిలో మిర్చి కొనుగోళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఈసారి మేడారం జాతర రావడం వల్ల కాస్త ఆలస్యం జరిగింది. మార్కెట్ పాలకమండలి, వ్యాపారులతో సమావేశం నిర్వహించి వారం రోజుల్లో మహబూబాబాద్ వ్యవసాయ మార్కె ట్లో మిర్చి కొనుగోళ్ళు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. 

సృజన్, కార్యదర్శి, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్