15-09-2025 12:51:42 AM
-మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
-ఎస్పీ శబరీశ్‌తో కలిసి ఆయా ప్రాంతాల సందర్శన
మేడారం, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారంలో ప్రతీ రెండేండ్లకోసారి ప్రతిష్ఠాత్మకంగా జరిగే సమక్క జాతర ఏర్పాట్లను ఆదివారం మంత్రి సీతక్క పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపడుతున్న ముందస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరీశ్ బుల్లెట్ బండిపై కూర్చొని, మేడారం పరిసర ప్రాంతాల్లో కలియదిరిగారు.
జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు జాతరకు తరలివచ్చే అవకాశం ఉన్నందు ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రముఖుల రాకతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై పోలీసు అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జాతర ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.