calender_icon.png 29 August, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో వరద పరిస్థితి ఎలా ఉంది?

29-08-2025 05:15:52 AM

  1. ఆరా తీసిన రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా
  2. టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావుకు ఫోన్ చేసిన కేంద్రమంత్రులు
  3. కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణలో వరద ప్రభావిత జిల్లా ల పరిస్థితులపై కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా ఆరా తీశారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావుకు గురువారం కేంద్రమంత్రులు ఫోన్ చేసి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధా లా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలకు వీలుగా అవసరమైన మేరకు సిబ్బందిని, సామాగ్రిని కేంద్రం నుంచి వెంటనే పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు, ఆపై నాయకులతో  రాంచందర్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి.. భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ వరద పరిస్థితు లపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. కేంద్రరక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేంద్రమంత్రులు చర్చిం చి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరింపజేసినట్లు తెలిపారు.

బాధితులను రక్షించేందుకు ప్రత్యే క వైమానిక దళ హెలికాప్టర్లు అవసరమని అభ్యర్థించగా, కేంద్రం సానుకూలంగా స్పం దించి ప్రత్యేక హెలికాప్టర్లను పంపించినట్లు వివరించారు. ప్రస్తుతం హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహా యక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాం తాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియలో ఎన్డీఆర్‌ఎఫ్ టీంలు నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. 

ప్రజలకు అండగా నిలవాలి

వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అందు బాటులో ఉండి, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. వరద ప్రాంతాలకు సిబ్బంది చేరుకోలేని పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారం, తాగునీరు, రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రత్యేకంగా బీజెవైఎం కార్యకర్తలు, కార్పొరేటర్లు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.

బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిబద్ధతతో ఉండాలని పిలుపునిచ్చారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు తమ సేవలు విస్తృతంగా అందించాలని ఆయన కోరారు.