06-07-2025 12:00:00 AM
‘అదేంటి.. మీ వయసెంత? అంటే చెప్పగలం. మీ గుండె వయసెంత?’ అంటే ఏం చెబుతాం. నిజానికి మీ వయసు మీ గుండె వయసూ ఒకటే కదా అనుకుంటున్నారా? కానేకాదంటున్నారు శాస్త్రవేత్తలు. రోజువారీ జీవితంలో ఒత్తిడి అనుభవించేవా ళ్లూ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవాళ్లలో గుండె వయసు (ఫంక్షనల్ ఏజ్) ఎక్కువగా ఉంటుందట.
ఆరోగ్యవంతుల్లో అసలు వయసూ గుండె వయసూ ఒకటిగా ఉంటే.. వీళ్లలో మాత్రం గుండె వయసుకు కనీసం 10 ఏళ్లు ఎక్కువగా ఉం టుందని చెబుతున్నారు. ఉండటమే కాదు.. దానికి తగ్గట్టే గుండె పనితీరు కూడా మందగిస్తుందట. అలా మందగించిన గుండె పనితీరుని కచ్చితంగా అంచనావేయడానికే ఓ సరికొత్త ఎమ్మారై స్కానింగ్ సాంకేతికతని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు.
ఇంగ్లండులోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ) పరిశోధకులు కనిపెట్టిన ఈ స్కానింగ్ పరికరం గుండె కవాటాల పనితీరును బేరీజు వేసి అసలు వయసుని లెక్కగడుతుందట. తద్వారా.. 35 ఏళ్ల వయసులోనే భవిష్యత్తులో రాబోయే గుండె సమస్యల్ని అంచనావేసే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏవైనా లోపాలు కనిపించినప్పుడు జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడానికి, అవసరమైతే ముందు జాగ్రత్తగా మందులు వాడటానికి అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు.