06-07-2025 12:00:00 AM
పొద్దున్నే తినే తిండి మధ్యాహ్నం వరకూ మనల్ని నడిపిస్తుంది. అవసరమైతే పరిగెత్తిస్తుంది. దాదాపు 12 గంటల ఉపవాసం తర్వాత తీసుకునే.. తొలి ఆహారం ఇదే. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అనేది తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి గుడ్డు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఏ రూపంలో తీసుకున్నా మంచిది. గుడ్డులో ఫోలేట్, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, డి, ఇ, బి12, బి6 విటమిన్లు పుష్కలం.
గుడ్డులో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు, ఖనిజాలూ ఎక్కువ. వండుకోవడం సులభమే. దీంతో ఆలస్యమైందనో, ఓపికలేదనో బ్రేక్‌ఫాస్ట్‌ను ఎగ్గొట్టలేం. పిల్లలు మొదలు వృద్ధుల వరకూ.. ఎవరైనా నిక్షేపంగా తీసుకోవచ్చు. మెదడుకు పదును పెట్టడం నుంచి జీవక్రియను పెంచడం వరకు.. అన్ని రకాలుగా సాయపడుతుంది.
గుడ్డు అత్యంత నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తుంది. శరీరం సొంతంగా తయారు చేసుకోలేని తొమ్మిది అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. గుడ్డు కంటిని రెప్పలా కాపాడుతుంది. కండరాల వృద్ధికి సాయపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే.. అలసటే తెలియదు. ఉడికించిన గుడ్డులో 70 శాతం క్యాలరీలు ఉంటాయి. రుచి కోసం ఆమ్లెట్ వేసుకుంటే ఆ విలువ 200 క్యాలరీలకు చేరుతుంది. బ్రెడ్‌తో జోడిస్తే ఏకంగా 350 క్యాలరీలకు పెరిగిపోతుంది. గుడ్డును ప్రకృతి ప్రసాదించిన మల్టీవిటమిన్ టాబ్లెట్‌గా చెబుతారు నిపుణులు.