calender_icon.png 10 July, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటికి ఎండ తాకాల్సిందే!

06-07-2025 12:00:00 AM

సూర్యరశ్మి వల్ల ఆరోగ్యం మెరుగవుతుందన్న ఈ మాట అక్షరాలా నిజమని చెబుతున్నారు విటమిన్ డి గురించి తెలిసినవాళ్లు ఎవరైనా. ఎందుకంటే మన ఆరోగ్యానికి అవసరమైన డి విటమిన్ అందేది సూర్యకిరణాల నుంచే మరి. ఎండ ద్వారా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈ విటమిన్ శరీర జీవక్రియలకు అవసరమైన పోషకాల్లో ప్రత్యేకమైనదయినా.. చాలావరకూ దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 

ఆ ఫలితమే వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. డి విటమిన్ మన శరీరానికి ఎంత అవసరం.. దీనివల్ల లాభాలేంటీ.. ఇది లేకపోతే జరిగే నష్టాలేంటీ.. ఎలా ఇది శరీరానికి అందుతుంది.. 

ఏ ఆహారం తినాలి వంటి అంశాలను చూద్దాం.. 

డి మిటమిన్‌కు ప్రధానమైన సోర్స్ కచ్చితంగా సూర్యుడే. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మంలోని కొలెస్ట్రాల్‌తో కలిస్తే డి విటమిన్ తయారవుతుంది. ఎండ నేరుగా మనల్ని తాకకపోవడం వల్లే వస్తుంది సమస్యంతా. ముఖ్యంగా పట్టణాల్లో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. అందుకు తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, శరీరానికి తగినంత డి విటమిన్ అందుతుంది. 

అన్నీ సమస్యలకు..

శరీరానికి అన్నిరకాల పోషకాలూ అందితేనే కదా ఆరోగ్యం. అందులో విటమిన్లు, ప్రోటీన్లు, మాంసకృత్తుల్లాంటివన్నీ ఉంటాయి. వాటిల్లో డి విటమిన్ పాత్ర అన్నింటికన్నా ముఖ్యమైంది. చర్మంపైన సూర్యరశ్మి పడటం వల్ల తయారయ్యే విటమిన్ డి.. కాలేయానికీ, ఆ తర్వాత మూత్రపిండాలకీ వెళ్లి చురుకైన హార్మోన్‌గా మారుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికీ, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికీ ఎంతో అవసరం. ఇంకా కండరాలూ, మెదడు కణాల పనితీరు దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

బీపీ నియంత్రణలో ఉపయోగపడుతూనే, ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరిగేలా చూస్తుంది ఇది. గుండె ఆరోగ్యానికీ దోహదపడుతుంది. మూడ్ స్వింగ్స్, ఆందోళన లాంటి మానసిక సమస్యల్ని తగ్గించడానికి కూడా డి విటమిన్ కావాల్సిందే. కొన్నిరకాల క్యాన్సర్లనూ ఇది దరిచేరనివ్వదు. అంతేనా.. ఆహారపదార్థాల నుంచి క్యాల్షియం, ఫాస్ఫరస్‌లను శరీరం గ్రహించడానికి ఇదే కారణం. ఇలా ఎన్నో రకాలుగా సాయపడుతున్న డి విటమిన్ లేకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. 

ఇలా చేద్దాం..

- పొద్దున పూట తొమ్మిది గంటల్లోపు వచ్చే ఎండ నుంచే డి విటమిన్ అందుతుందని అనుకుంటాం కానీ నిజానికి ఉదయం 10 గంటల మధ్య ఇది మనకు పుష్కలంగా లభిస్తుంది. ఈ సమయంలో 15 నిమిషాల వరకూ ఎండ మన శరీరానికి తగిలితే సరిపోతుంది. 

- ఒంటిని పూర్తిగా కప్పే దుస్తులు వేసుకుంటే, మన చర్మానికి సూర్యరశ్మి అస్సలు తగలదు. సన్‌స్క్రీన్ లోషన్ రాసుకున్నా విటమిన్ డి అంతగా తయారవ్వదు. కాబట్టి ఎండ కోసం బయటకు వెళ్లినప్పుడు ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. 

- బస్సులూ, కార్లలో వెళుతున్నప్పుడూ, ఇంట్లో కిటికీల నుంచి అద్దాల మీదుగా సూర్యరశ్మి ఒంటి మీద పడటం పెద్దగా ఉపయోగపడదన్న సంగతీ గుర్తుంచుకోవాలి.

- నీరసం, నిద్రపట్టకపోవడం, అలసట, ఒళ్లునొప్పులు.. ఇవన్నీ మామూలు అనారోగ్య సమస్యలే కదా, అంటూ ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా.. ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారైనా డి విటమిన్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే డి విటమిన్ లోపమే ఎన్నో రోగాలకు మూలమవుతోంది. ఆ లోపం స్థాయిని బట్టి తగిన మోతాదులో వైద్యులు ట్యాబ్లెట్లూ, షాట్స్ లాంటి డి విటమిన్ సప్లిమెంట్లను సూచిస్తారు. కానీ ఉచితంగా సూర్యుడి నుంచి, సహజంగా ఆహారం నుంచి వచ్చే డి విటమిన్ మీద దృష్టి పెడితే ఎలాంటి ప్రమాదం ఉండదు.