ఎరువుల సంక్షోభానికి చెక్ పెట్టేదెలా?
భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రసాయన ఎరువుల దిగుమతి కోసమే దాదాపు రూ.1.25 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం రూపంలో వెచ్చిస్తున్నది. ఇది మన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న రసాయన ఎరువుల భారానికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, చైనా ఎగుమతులపై ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గుల వల్ల మన దేశీయ ఎరువుల సరఫరా గొలుసు నిరంతరం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఈ భారం నుంచి దేశాన్ని శాశ్వతంగా గట్టెక్కించడానికి విప్లవాత్మక ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైంది.
మనం ఒకవైపు వేల కోట్లు ఖర్చు చేసి నై ట్రోజన్, ఫాస్ఫరస్ వంటి ఎరువులను దిగుమతి చేసుకుంటుంటే.. మరోవైపు అదే పోష కాలు అత్యంత సమృద్ధిగా ఉన్న మిలియన్ల లీటర్ల మురుగునీటిని ప్రతిరోజూ వృథాగా నదుల్లోకి, సముద్రాల్లోకి వదిలేస్తూ పర్యావరణాన్ని కాలుష్యం చేసుకుంటున్నాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికల ప్రకారం దేశంలో ఒక రోజుకు ఉత్పత్తి అవుతున్న సుమారు 7300 కోట్ల లీటర్ల మురుగునీటిలో సగానికి పైగా ఎటువంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే నేరుగా ప్రకృతిలో కలుస్తోంది.
ఈ మురుగునీటి నుంచి వెలువడే బురదను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి, అందులోని నైట్రోజన్, ఫాస్ఫరస్‌లను సేకరించగలిగితే, అది రసాయన ఎరువుల కంటే 20 శాతం తక్కువ ఖర్చుతోనే దేశీయ ఎరువుల అవసరాలను తీర్చగలదు. అంతర్జాతీయ ఎరువుల సంఘం అంచనాల ప్రకారం.. ప్రపంచ దేశాలు తమ మురుగు వ్యర్థాల పునరుద్ధరణపై దృష్టిపెడితే, గ్లోబల్ ఫాస్ఫరస్ డిమాండ్‌లో 30 శాతం, నైట్రోజన్ డిమాండ్‌లో 20 శాతం వరకు మానవ వ్యర్థాల నుంచే సాధించవచ్చు.
ఐరోపా దేశాలైన నెదర్లాండ్స్, డెన్మార్క్ ఇప్పటికే ఈ విధానంలో అద్భుత విజయా లు సాధించాయి. జర్మనీ సైతం ఒక అడుగు ముందుకువేసి, రాబోయే మూడేళ్లలో దేశంలోని అన్ని పెద్ద మురుగునీటి ప్లాంట్ల నుంచి ఫాస్ఫరస్ సేకరించడాన్ని తప్పనిసరి చేసింది. ఆసియాలో గమనిస్తే, దక్షిణ కొరియా ఒకే ఒక్క దశాబ్దంలో తాగునీరు, మురుగునీ టి మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, నేడు 95 శాతం పైగా పారిశుధ్య పరిధిని సాధించింది. కానీ, భారతదేశం మాత్రం గత పదేళ్లలో దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ, ఆ వ్యర్థాలను సమర్థవంతంగా శుద్ధిచేసే అదనపు మురుగునీటి శుద్ధి ప్లాంట్లపై ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెట్టలేకపోయింది.
ఈ వ్యవస్థాగత లోపానికి ప్రధాన కార ణం బ్రిటిష్ కాలం నాటి, అంతకంటే ముం దున్న చారిత్రక, కుల ఆధారిత పారిశుద్ధ్య ఆలోచనా విధానమే. 19వ శతాబ్దంలోనే టో క్యో వంటి అంతర్జాతీయ నగరాలు ఆధునిక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించుకుంటుంటే, అప్పటి బ్రిటిష్ పాలకులు భారత దేశంలో సాంకేతికతపై పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు. దానికి కారణం వారికి ఉచితంగా లేదా తక్కువ కూలీతో లభించే వంశ పారంపర్య శ్రామికులు అందుబాటులో ఉండటమే.
వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి రక్షించాలన్నా, ఎరువుల సబ్సిడీల భారాన్ని తగ్గిం చాలన్నా, రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించాలన్నా పునరుత్పత్తి మినహా మరో మార్గం లేదు. భారతదేశం తన పారిశుద్ధ్య రంగాన్ని కేవలం ‘శుభ్రత’ కోణంలోనే కాకుండా ‘ఆర్థిక, వ్యవసాయ పునరుద్ధరణ’ కోణంలో చూడాలి. జాతీయ పారిశుధ్య విధానాన్ని, జాతీయ ఎరువుల పాలసీతో అనుసంధానించాలి.
నగరాల నుంచి వచ్చే మురుగునీటిని శాస్త్రీయంగా శుద్ధిచేసి, మానవ ప్రమేయం లేకుండా వంద శాతం యాం త్రీకరణ ద్వారా ఎరువులుగా మార్చినప్పుడే రెండు ప్రధాన జాతీయ లక్ష్యాలు నెరవేరుతాయి. అటు శతాబ్దాలుగా మురుగుగుం తల్లో మగ్గుతున్న శ్రామికులకు వివక్ష, ప్రా ణాంతక శ్రమ నుంచి విముక్తి లభిస్తుంది, ఇటు దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అయ్యి వ్యవసాయ రంగంలో నిజమైన ‘స్వయం సమృద్ధి’ సిద్ధిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయా లకు అతీతంగా ఈ ‘వ్యర్థాల నుంచి ఎరువుల’ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడమే నేటి దేశ ప్రగతికి ఏకైక రాజమార్గం.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9848559863
వెంకగారి భూమయ్య






