రీయింబర్స్‌మెంట్ భారం
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2008 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలవుతున్నది. ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో ఇంజినీరింగ్, ఫార్మసి, మెడిసిన్, ఎంబీఏ, పీజీ, డిగ్రీ తదితర కోర్సులు చదివే అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరిస్తున్నది. ఈ పథకం కింద రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ పథకం అందుబాటులోకి వచ్చాక పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్య వైపు మొగ్గుచూపడం మొదలైంది. ఈ పథకం మూలంగానే మహబూబ్‌నగర్, శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాల్లో యువత వలసలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. నేడు తెలుగు రాష్ట్రాలకు ఉపాధి కోసం బీహార్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వలస వస్తున్నారు.
అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటైన గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు కూడా ఇందుకు కారణం. ప్రభుత్వాలు వీటిలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో నిరుపేద విద్యార్థులు బడి బాట పట్టారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో నిర్విఘ్నంగా కొనసాగిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం బీఆర్‌ఎస్ హయాంలో అటకెక్కింది. బీఆర్‌ఎస్ సర్కార్ సుమారు రూ.2 వేల కోట్ల ఫీజు రుసుములను బకాయి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బకాయిలను మరింతగా పెంచింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిధుల విడుదలలో ఆలస్యం వల్ల ఈ రెండున్నర సంవత్సరాల్లోనే బకాయిలు రూ.ఆరు వేల కోట్ల కు చేరుకున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి వరకు పెండింగ్ బకాయిల కింద రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసింది. తమది ప్రజాపాలన అని ఆర్భాటాలకు కోట్ల రూపాయలను దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కో సం బడ్జెట్ విడుదల చేయకపోవడం శోచనీయం. దీని వెనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని అనుమానాలు కలుగుతున్నాయి.
విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 10 శాతంలోపే నిధులు కేటాయించి అన్యాయం చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే విద్యారంగం అభివృద్ధి చెందితే తప్ప సాధ్యం కాదు. 2026 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల ఖాతాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 7ను జారీచేసింది. మేధావులు, ఉద్యమ కారులు, విద్యార్థులు వ్యతిరేకించడంతో ఆ జీవోను రద్దు చేసింది. ఆ తర్వాత జీవో 8, 9లను తీసుకొచ్చి మరోమారు విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టింది.
అడ్మిషన్ ఫీజులు చెల్లించే స్థోమత లేని పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో 8, 9లను రద్దు చేసి, ఫీజ్ బకాయిలు చెల్లించాలి. తద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని విద్యావంతులు, మేధావులు కో రుతున్నారు. అదే సమయంలో మానవతా దృక్పథంతో లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రతి సంవత్సరం తమ రెండు నెలల జీతాన్ని రాష్ట్ర విద్యానిధికి విరాళంగా ఇచ్చి వి ద్యాభివృద్ధికి తోడ్పడితే చాలా బాగుంటుంది.
వ్యాసకర్త సెల్: 9866170384
బూర్గుపల్లి కృష్ణ యాదవ్






