19-03-2025 12:31:55 AM
మెదక్, మార్చి 18(విజయక్రాంతి)ః వేసవి కాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో భూగర్భ జలాలు సైతం ఎండు ముఖం పడుతున్నాయి. దీంతో యాసంగిలో వేసిన పంటలు నెర్రలు వారు తున్నాయి. వేసవిలో సాధారణంగా సాగునీటి కష్టాలు ఎక్కువే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం బోరుబావులపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు.
జిల్లాలో వరి సాగు అత్యధికంగా సాగవుతోంది. మార్చిలోనే ఎండలు ముదురుతున్నందున వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా యాతలు పడుతున్నారు. ప్రధానంగా వరికి నీటి అవసరం ఎక్కువగా ఉండడంతో రైతులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఇప్పడే ఇలావుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో అన్నదాతలు కన్నీళ్ళు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10వేల ఎకరాల వరి పంట ఎండుముఖం పట్టినట్లు ప్రాథమిక అంచనాగా అధికారులు చెబుతున్నారు.
జిల్లాల్లో ఎండుతున్న పంటలు...
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. మెదక్ జిల్లాలో సాదారణ సాగు 2,61,000 ఎకరాలు ఉండగా ఈసారి 2,58,487 ఎకరాల్లో సాగైంది. ఇందులో సన్నరకం 43,587 ఎకరాలు, దొడ్డురకం 2,14,900 ఎకరాలు సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం సాగునీటి ఎద్దడి వల్ల ఇప్పటికే సుమారు ఐదువేల ఎకరాల వరి పంట ఎండిపోతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో 1,10,000 సాదారణ సాగుకు క్రాప్ హాలిడే సందర్భంగా కేవలం 38,740 ఎకరాలు మాత్రమే సాగు అయింది. ఇందులో సన్నరకం 3,099, దొడ్డు రకం 35,641 ఎకరాలు సాగు చేశారు.
ఈ జిల్లాలో సైతం సుమారు 3,500 ఎకరాల పంట ఎండిపోతుంది. సిద్దిపేట జిల్లాలో 3,50,000 ఎకరాల సాదారణ సాగు కాగా 3,50,488 ఎకరాలు కొంత ఎక్కువగా సాగు చేశారు. ఇందులో సన్నరకం 38,497 ఎకరాలు కాగా దొడ్డురకం 3,11,991 ఎకరాలు. ప్రస్తుతం 1002 ఎకరాలు ఎండుముఖం పడుతున్నాయి.
బోరు బావులే ఆధారం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోరు బావులపైనే ఆధారపడి వరి పంటలు వేశారు. వానాకాలంలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో సాగు విస్తీర్ణాన్ని పెంచారు. అయితే ఎండలు పెరిగి నీటిమట్టం పడిపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోయి లబోదిబోమంటున్నారు.
ప్రస్తు తం బోరు బావుల్లో నీటిమట్టం 2 -3 మీటర్ల వరకు తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పంటలను కాపాడు కోవ డానికి కొందరు రైతులు కొత్త బోర్లను వేయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వేలాది ఎకరాల్లో వరి పంట నష్టపోయే పరిస్థితి దాపురిస్తుందని వాపోతున్నారు.
సాగునీరు అందించండి సారు!
కొండపాక, మార్చి 18 : కొండపాక మండల వ్యాప్తంగా ఉన్న పంట పోలాలకు సాగునీరు అందక పంటలు ఉండిపో తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దు అనక మాపు అన కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించి ప్రపంచానికి ఆహారాన్ని అందించాలని రైతు కష్టపడితే, ఇప్పుడు రైతులు పండించే పంటలు ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీళ్లు అందించిన సరిపోవడం లేదు. చేతికొచ్చిన పంట ఎండిపోతుందంటే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ నుంచి సాగునీరు, తపస్పల్లి రిజర్వాయర్ ను నింపి, తపస్పల్లి రిజర్వాయర్ నుంచి డి4 కెనాల్ ద్వారా కొండపాక మండలంలోని పంట పోలాలకు సాగునీరు అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.