calender_icon.png 17 September, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ పోరాటంలో జిల్లా కీలక పాత్ర

17-09-2025 12:29:03 PM

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరం  

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలకపాత్ర పోషించిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. జిల్లా నుంచి భీంరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మ భిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి లాంటి ఎందరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారని తెలిపారు. ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందన్నారు. భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, శాలిగౌరారం, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయని తెలిపారు.

తొలి దేశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ  మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రొఫెసర్ జయశంకర్, జలగం వెంగళరావు, టి ఎన్  సదా లక్ష్మి, మదన్ మోహన్, మర్రి చెన్నారెడ్డి ఉద్యమకారులతో కలిసి తొలి దేశ ఉద్యమాన్ని  ముందుకు నడిపించారని పేర్కొన్నారు. నవ యువకుల త్యాగాలకు చెల్లించిపోయి ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నేను  మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి మీకు తెలిసిన విషయమే అన్నారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి నల్లగొండ జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు భూములు కేటాయించడం జరిగిందన్నారు. నల్లగొండలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మిగిలిన ఐదు నియోజకవర్గాలలో నిర్మాణ పనులు టెండర్ దేశలో ఉన్నాయని త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించి నిరుపేదలకు మెరుగైన విద్య అందిస్తామని చెప్పారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్,  అధికారులు తదితరులు పాల్గొన్నారు.