17-09-2025 12:03:05 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్(Parade Grounds) మైదానంలో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) పాల్గొన్నారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారు.. రాజా కార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం(Hyderabad State) భారత్ లో కలిసిందన్నారు. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. సర్దార్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని తెలిపారు. ఆపరేషన్ పోలోతో సర్దార్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని కొనియాడారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మమార్గంలోనే నడుస్తామని రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారు.
జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 తొలగించి జమ్ముకశ్మీర్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మనలో ఎన్ని భేధాలున్నా దేశం విషయంలో అందరిదీ ఒకటే మాట అన్నారు. దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలంతా ఒక్కతాటిపైకి వస్తామని సూచించారు. ఆపరేషన్ సింధూర్ లో మన సైనికులు సత్తా చాటారని ప్రశంసించారు. పహల్గాంలో మతం పేరు అడిగిమరీ చంపిన వారికి బుద్ధి చెప్పామన్నారు. ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబసభ్యులను హతమార్చామని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తో భారత్ శక్తిసామర్థ్యాలు, సైనిక సత్తాను ప్రపంచం చూసిందన్నారు. ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ వారిని హతమార్చామని చెప్పారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, బండి సంజ్ కుమార్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.