17-09-2025 12:23:56 PM
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), సీనియర్ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలు రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజు అన్నారు. కొంతమంది దీనిని విమోచనమని, విలీనం అన్నా, వేలాది మంది ఆనాటి రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ అన్న కేటీఆర్(KTR) ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం.. ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం.. అన్నింటినీ తెలంగాణ చూసిందన్నారు. చాకలి ఐలమ్మ, షేక్ బందగి, రావి నారాయణరెడ్డి వంటి అద్భుతమైన అమరవీరులను తెలంగాణ తెలంగాణ కన్నదని గుర్తుచేశారు. తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. గ్రూప్-1 విద్యార్థులు(Group-1 students) తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆకాంక్షలు వ్యక్తపరచుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ రోజును సమైక్య దినోత్సవంగా జరుపుకుందామన్న ఆయన ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.