17-09-2025 12:31:59 PM
ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ... రోడ్డెక్కిన విద్యార్థులు
గద్వాల జిల్లా బొంకూరులో సంఘటన
అలంపూర్: ఓ పక్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క తాము చదువుకుంటున్న పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. బుక్కు చేతబట్టి చదవాల్సిన విద్యార్థి లోకం.. సార్లు లేక.. బుక్కులు తెరవక అనేవంటి ప్లకార్డులను చేత పట్టుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) ఉండవల్లి మండలం బొంకూరు గ్రామంలోని రాయచూరు- కర్నూలు అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని తరగతులు కలుపుకొని 274 మంది విద్యార్థులు ఉండగా కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
దీంతో విద్యార్థులకు బోధన కష్టతరమైంది.ప్రతి ఏడాది స్కూల్ పునః ప్రారంభంలో డిప్యూటేషన్ పై ఉపాధ్యాయులు వచ్చేవారని..ఈ ఏడాది సగం గడిచిన ఇంతవరకు ఉపాధ్యాయులు రాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గణితం, బయో సైన్స్ సోషల్ వంటి ప్రధాన సబ్జెక్టులకు టీచర్లే లేరన్నారు. దీంతో టీచర్లను నియమించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ శివప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా ఉపాధ్యాయులను నియమించి మా సదువులు సక్రమంగా కొనసాగేటట్టు ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.