calender_icon.png 22 October, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీకి హెచ్‌ఆర్‌సీ నోటీసులు

22-10-2025 01:34:26 AM

రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరణ 

24 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవ్వాలని శివధర్‌రెడ్డికి స్పష్టీకరణ

హైదరాబాద్, సిటీబ్యూరో/ నిజామాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) స్పం దించింది. మీడియా కథనాల ఆధారంగా ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించింది. నవంబర్ 24లోపు ఎన్‌కౌంటర్‌పై నివేదిక సమర్పించాలని డీజీపీ శివధర్‌రెడ్డిని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై ఆర్టికల్- 21 ప్రకారం జీవించే హక్కుపై తాము ప్రశ్న లేవనెత్తుతున్నామని కమిషన్ అభిప్రాయ పడింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్ట్‌మార్టం నివేదిక సహా వివరణాత్మక నివేదికను సమర్పించాలని సూచించింది. అయితే.. ‘పలు కేసుల్లో నిందితుడైన రియాజ్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. నిందితుడు ఈ క్రమంలో సోమవారం పోలీసుల తుపాకీ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపగా నిందితుడు మృతిచెందాడు’ అని రియాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీస్‌శాఖ వివరణ ఇచ్చిన సంగతి విదితమే. .

హంతకులకు మద్దతివ్వడం సరికాదు.. 

వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బాలస్వామి

విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ను నిందితుడు రియాజ్ క్రూరంగా హత్య చేసినప్పుడు స్పందించని మానవ హక్కుల కమిషన్.. నిందితుడికి తగిన శాస్తి జరిగినప్పుడు మాత్రం స్పందిస్తున్నదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. హంతకులకు మద్దతు ఇచ్చేలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఎన్‌కౌంటర్ పోలీసుల పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు. అందుకు ముందడుగు వేసిన డీజీపీ శివధర్‌రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ సాయిచైతన్యకు వీహెచ్‌పీ తరఫున అభినందనలు తెలుపుతున్నామని ప్రకటించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఎంతటి వ్యక్తికైనా ఇదే రీతిలో జవాబు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.