calender_icon.png 13 July, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాటరీ పేరుతో భారీ మోసం

24-06-2025 12:09:02 AM

  1. రూ.4 కోట్లతో నిర్వాహకుల పరార్
  2. --  2,600 మందిని బురిడీ కొట్టించిన వైనం

మిర్యాలగూడ, జూన్ 23: మిర్యాలగూడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఒక్కటీ కాదు రెండు కాదు.. ఏకంగా రూ.4 కోట్లతో నిర్వాహకులు పరారయ్యారు. బహుమతుల పేరుతో ఎర వేసి దాదాపు 2600 మందిని ఆకర్షించి ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున 15 నెలల పాటు వసూలు చేసి జంప్ అయ్యారు. రూ.4 కోట్లతో నిర్వాహకులు ఉడాయించిన ఘటన సోమవారం మిర్యాలగూడ పట్టణంలో కలకలం రేపింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన రమేశ్, కోటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ’ఆర్కే ఎంట్ర్పజెస్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వీరు నెలకు రూ.1000 చొప్పున 15 నెలల పాటు చెల్లించేలా ఒక స్కీమ్ను ప్రకటించారు. ప్రతి నెలా డ్రా తీసి, పది మంది అదృష్టవంతులకు విలువైన బహుమతులు అందిస్తామని ప్రచారం చేశారు.

వీరి మాటలు నమ్మిన కొందరు వ్యక్తులు ఏజెంట్లుగా చేరారు. ఈ ఏజెంట్ల ద్వారా సంస్థ నిర్వాహకులు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల నుంచి దాదాపు 2,600 మందిని సభ్యులుగా చేర్పించుకున్నారు. ఇలా సభ్యుల నుంచి సుమారు రూ.4 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొదట్లో కొందరికి లాటరీ స్కీమ్లో భాగంగా డ్రాలు తీసి బహుమతులు అందించారు. దీంతో ప్రజలకు నమ్మకం కుదిరింది.

అయితే, స్కీమ్ గడువు ఈ ఏడాది జనవరి నెలతో పూర్తి కావడంతో, అప్పటి నుంచి సభ్యులకు ఇవ్వాల్సిన వస్తువులు, బహుమతుల విషయంలో నిర్వాహకులు కాలయాపన చేస్తూ వచ్చారు. చివరికి, వారు అందుబాటులో లేకుండా పోయారు. తమ డబ్బు పోయిందని, మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ మోతీరాం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిందితులను త్వరగా పట్టుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.