17-10-2025 01:01:08 AM
మెటాలిక్ డోర్ లాక్, పొద్దుతిరుగుడు విత్తనాల్లో రవాణా
ఒకరి అరెస్టు, కేసు నమోదు
రాజేంద్రనగర్, అక్టోబర్ 16(విజయక్రాంతి): గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల మేరకు విదేశాల నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో గురువారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు కాపుగాసి కువైట్ నుంచి షార్జా మీదుగా శంషాబాద్ విమానాశ్రయాన్ని చేరుకున్న ఎయిర్ అరేబియా (జీ9-467) విమానంలో వచ్చిన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని అతని లగేజ్ ని స్కానింగ్ చేసి తనిఖీ నిర్వహించగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మెటాలిక్ డోర్ లాక్ లో, పొద్దు తిరుగుడు విత్తనాలలో దాచిపెట్టిన బంగారం కడ్డీలు బయటపడ్డాయి. ప్రయాణికుడి నుంచి 2.37 కోట్ల విలువ చేసే 24 క్యారెట్ల 1 కిలో 798 గ్రాముల బంగార కడ్డీలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.