15-11-2025 12:00:00 AM
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ
దోహా, నవంబర్ 14 : భారత క్రికెట్‌లో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. 14 ఏళ్ల వయసులోనే పరుగుల వరద పారిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ సంచలనం ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో దుమ్మురేపాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.
క్రీజులోకి వస్తూనే ధాటి గా ఆడిన వైభవ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ మరో 16 బం తుల్లో మూడంకెల మార్క్ అందుకున్నాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సర్లున్నాయి. సెంచరీ తర్వాత కూడా మరింతగా రెచ్చిపోయిన వైభవ్ దెబ్బకు యూఏఈ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. ఓవరాల్‌గా టీ20 కెరీర్‌లో సూర్యవంశీకిది రెండో శతకం.
గత ఐపీఎల్ సీజన్‌లోనూ ఈ చిచ్చర పిడుగు సెంచరీ బాదాడు. తాజా ప్రదర్శనతో 14 ఏళ్ల వైభవ్ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.అతి పిన్న వయసు లో 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ, రిషబ్ పంత్ తర్వాత టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగానూ నిలిచాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 144 (42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు) రన్స్ చేశాడు. వైభవ్ విధ్వంసం తో పాటు జితేశ్ శర్మ మెరుపులతో భారత్ ఏ జట్టు 20 ఓవర్లలో 297/5 భారీస్కోర్ చేసింది. ఛేజింగ్‌లో యూఏఈ చేతులెత్తేయడంతో ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీని భారత్ ఏ జట్టు ఘనవిజయంతో ఆరంభించింది. కాగా ఐపీఎల్ టైమ్‌లో పలువురు స్టార్ బౌలర్లను ఉతికారేసిన వైభవ్ లీగ్ చరిత్రలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించా డు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన తర్వాత ఆసీస్ టూర్‌లోనూ మెరుపులు మెరిపించాడు.