calender_icon.png 15 November, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

15-11-2025 06:19:49 PM

జిల్లా వైద్యాధికారి డా.గోపాల్ రావు

వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): మండలంలోని నర్సాపూర్ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్‌ను శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.గోపాల్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లోని గదులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించి అత్యవసర చికిత్స మందులు పూర్తిగా అందుబాటులో ఉంచాలని, కొరత ఉన్నచో జిల్లా కార్యాలయానికి వెంటనే ఇండెంట్ పెట్టి పొందాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. సమయపాలన పాటించడం అత్యవసరమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవలే కొన్ని రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువసేపు చలిలో గడపకూడదని, శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు, వెచ్చగా ఉంచే దుస్తులు ధరించాలని సూచించారు. వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యకరమని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం లేదా శ్వాసలో ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు. గ్రామాలలో ప్రజలకు చలికాల ఆరోగ్య జాగ్రత్తలు, బాలల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్త శారద, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.