calender_icon.png 21 November, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైల్వేలో 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి

25-07-2024 01:20:07 AM

  • రాష్ట్రంలో కొనసాగుతున్న రూ.32,946 కోట్ల పనులు  
  • ప్రాజెక్టులకు రూ.5336 కోట్ల కేటాయింపు 
  • మీడియా సమావేశంలో రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ 
  • రైల్వే బడ్జెట్‌లోనూ తెలంగాణకు వివక్ష తప్పలేదంటున్న విశ్లేషకులు

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): భారతీయ రైల్వేలకు కేంద్ర బడ్జెట్‌లో రూ.2.62 లక్షల కోట్ల కేటాయింపులతో సంస్థను ప్రపంచస్థాయికి చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉద్ఘాటించారు. ఇందులో రైల్వే భద్రతకు సంబంధించి అధిక మొత్తంలో రూ.1.9 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి వర్చువల్‌గా కేంద్రమంత్రి పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం కొనసా గుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనులు మొత్తం వ్యయం రూ.32,946 కోట్లు కాగా రైల్వే నెట్‌వర్క్ 100 శాతం విద్యుద్దీకరించామని తెలిపారు. 2009 -14లో కేవలం 17 కి.మీ ట్రాక్ వేయగా గత పదేళ్లలో తెలంగాణవ్యాప్తంగా సగటున సంవత్సరానికి 65 కి.మీ మేర నూతన ట్రాకులు వేశామన్నారు. గత పదేళ్లలో 437 ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు నిర్మించామని తెలిపారు. రాష్ర్టంలోని 40 రైల్వేస్టేషన్‌లను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఏపీకి సంబంధించి ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు గతంలో కేటాయించిన భూమికి ముంపు సమస్య ఉందని అందుకే రాష్ర్ట ప్రభుత్వం భూమి కేటాయుంచిన తర్వాత నిర్మాణం ప్రారంభం అవుతుందని కేంద్రమంత్రి తెలిపారు. ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణానది మీదుగా రూ. 2,047 కోట్లతో 56 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. విజయవాడ నుంచి ముంబై వందేభారత్ సాధ్యం కాదన్నారు. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే 60 శాతం తగ్గాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 

40 అమృత్ స్టేషన్లు

ఆదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలంరోడ్, గద్వాల్, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజిగిరి జంక్షన్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీబాలబ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూరు, ఉందానగర్, జూకురాబాద్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యకుతపురా, జహీరాబాద్ స్టేషన్లను అమృత్ స్టేషన్లనుగా అభివృద్ధి చేయనున్నారు. 

తెలంగాణకు మొండిచెయ్యి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయమే జరిగింది. అలాగే రైల్వే బడ్జెట్‌లోనూ అదే ఒరవడి కనిపించింది. మొత్తం రూ.2.62 లక్షల కోట్లలో తెలంగాణకు దక్కింది కేవలం రూ.5,336 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో రూ.32,946 కోట్ల రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతుంటే కేవలం రూ.5,336 కోట్లు కేటాయించారు. 2009 సంవత్సరాల్లో ఉమ్మడి ఏపీ వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ.886 కోట్లు కాగా 2009- 14 మధ్యకాలంలో జరిగిన సగటు కేటాయింపుల కంటే ప్రస్తుత సంవత్సరం దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని రైల్వేమంత్రి గొప్పగా చెబుతున్నారు.

తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు నిరంతరాయంగా పెరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు. అయితే పొరుగు రాష్ట్రమైన ఏపీకి మాత్రం ఇదే బడ్జెట్‌లో రూ.9,151 కోట్లు కేటాయించడం గమనార్హం. గత ఏడాది తెలంగాణకు రూ.4,418 కోట్లు కేటాయిస్తే ఏపీకి మాత్రం అప్పుడు కూడా భారీగానే (రూ.8,406 కోట్లు) పొందుపరిచారు. గత రెండేళ్లుగా కూడా తెలంగాణ కంటే ఏపీ పైనే కేంద్రం దొడ్డ మనసు చూపిస్తోంది. 

సొంత రాష్ట్రాలకు మోదం

అశ్వినీ వైష్ణవ్ తన స్వరాష్ట్రమైన రాజస్థాన్‌కు రైల్వే కేటాయింపుల్లో పెద్దపీట వేస్తూ రూ.9,959 కోట్లు కేటాయించారు. ఇక ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒడిశా (ఇప్పుడు అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది)కు సైతం గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.10,586 కోట్లు వడ్డించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న యూపీకి భారీగా రూ.19,849 కోట్లు అందిస్తున్నారు. ఏ విధంగా చూసుకున్న తెలంగాణకు మాత్రం కేంద్రం రైల్వే కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది.