24-08-2025 12:00:00 AM
తుర్కయంజాల్, ఆగస్టు 23: తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 159లో పార్కు స్థలం పేరుతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడాన్ని భూ బాధితులు తప్పుపట్టారు. 21వ వార్డు పరిధి సూర్యసాయి నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 201లో పార్కు స్థలం కబ్జా అయిందని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో చర్యలకు శ్రీకారం చుట్టిన హైడ్రా సిబ్బంది సర్వే నెంబర్ 159లో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని మండిపడ్డారు.
పార్కు స్థలం కబ్జాకు గురైనది ఒక సర్వే నెంబర్లో అయితే మరో సర్వే నెంబర్లోని నిర్మాణాలను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. గతం నుంచి ఈ వివాదం నడుస్తోందని, ఇదివరకే ఏడీ సర్వే చేయించినట్లు తెలిపారు. హైడ్రా అధికారులు ఇప్పటికైనా సరైన విచారణ జరపాలని విన్నవించారు.
హైడ్రా అధికారులు మరోసారి ఏడీ సర్వే చేపట్టి నిజనిర్థారణ చేయాలన్నారు. ఏడీ సర్వే ఎలా వచ్చినా తాము అంగీకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కొత్తకుర్మ కుమార్, కొత్తకుర్మ సూరమ్మ, కొత్తకుర్మ జంగయ్య, కొత్తకుర్మ పద్మమ్మ, కొత్తకుర్మ మల్లేష్, కొత్తకుర్మ పోచయ్య, కొత్తకుర్మ వెంకటేష్, కొత్తకుర్మ కృష్ణ, కొత్తకుర్మ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు
తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి సూర్యసాయినగర్ లోని పార్కు స్థలం రక్షించేందు కు హైడ్రా శ్రీకారం చుట్టింది. సర్వేనెంబర్ 201లోని 482 గజాల పార్కు హైడ్రా ఇన్ స్పెక్టర్ తిరుమలేశ్ తన సిబ్బందితో కలిసి ఆక్రమణలను కూల్చివేతలు చేపట్టారు. 2018 సంవత్సరంలోనే ప్లాట్ నెంబర్లు 283, 284 మున్సిపాలిటీ పేరుపై రిజిస్ట్రేషన్ అయిందని హైడ్రా అధికారులు తెలిపారు.