calender_icon.png 24 August, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ హనీమూన్ ముగిసింది!

24-08-2025 01:27:15 AM

ఇక సమస్యలను పరిష్కరించండి

ధర్నా చౌక్ వద్ద జనం గుమికూడుతున్నారంటే మీకు టైం దగ్గర పడినట్లే! 

  1. జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రి ఉన్నప్పుడు.. డీఈవో, ఎంఈవోలు ఎందుకుండరు? 
  2. పెండింగ్ బిల్లులు ఎప్పుడిస్తరు.. 
  3. స్కూళ్లు ఎందుకు నడవడం లేదో పర్యవేక్షించండి 
  4. యూఎస్‌పీసీ మహాధర్నాలో వక్తలు 
  5. మద్దతు తెలిపిన కోదండరామ్, నాగేశ్వర్, నర్సిరెడ్డి, జగదీశ్వర్, ఏలూరి 
  6. లక్ష మందితో అక్టోబర్ 12 ఛలో హైదరాబాద్: మారం జగదీశ్వర్

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ‘మీ హనీమూన్ పీరియడ్ అయి పోయింది. ఇక ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పి దాటవేత కాలం ఇక ముగిసింది’ అని ఉపాధ్యాయ సంఘాల పోరా ట కమిటీ (యూఎస్‌పీసీ) మహాధర్నాలో వక్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించి, రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలుపుకోవాలని వారు డిమాండ్ చేశారు.

శనివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయులు మహాధర్నా జరి పారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు జిల్లాల నుంచి తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్సీలు కోదండరామ్, ప్రొ.నాగేశ్వర్, నర్సిరెడ్డి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ పాల్గొని ధర్నాకు తమ మద్దతు ప్రకటించారు. 

టీచర్లవి న్యాయమైన డిమాండ్లే: కోదండరామ్

 ప్రొ. కోదండరామ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న డిమాం డ్లు కొత్తవేమీ కావని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నవేనని చెప్పారు. 317 జీవో, పెండింగ్ బిల్లులు లాంటి ఎన్నో సమస్యలున్నాయన్నారు.  వీటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరా రు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, గతంలో చాలా సమస్యలపై కలిసి పని చేశామన్నారు. ఈ కీలక సమయంలోనూ టీచర్ల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. డిమాండ్లను సాధించడానికి సమిష్టిగా కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. 

ధర్నా చౌక్‌తో రాబోయే మార్పు తెలిసిపోతోంది: ప్రొ. నాగేశ్వర్

విద్యాశాఖలో పర్యవేక్షణ అధికారులు లేరని, అసలు డీఈవో, డీప్యూటీ ఈవో, ఎం ఈవో పోస్టులే మంజూరు కాలేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ అన్నారు. జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ఉన్నప్పుడు డీఈవో ఎందు కు ఉండరని ప్రశ్నించారు. ఈ పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. రిటైర్డ్ అయ్యే సమయానికి అన్ని రకాల బెనిఫిట్స్ ఉద్యోగికివ్వాలని,  కానీ రెండేళ్లయినా ప్రస్తుతం అవి అందడం లేదన్నారు.

పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని పదే పదే ప్రభుత్వం చెప్తోందని, మీకు చాతకాకపోతే ఉద్యోగులెందుకు బాధపడాలని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం పడిపో వడానికి అనేక కారణాల్లో 317 జీవో కూడా ఒక కారణమని, ఆ జీవో బాధితులకు ఈ ప్రభుత్వం ఇంతవరకూ న్యాయం చేయలేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు నడవ డంలేదో పర్యవేక్షించాలని కోరారు.

ఈ పో రాటం సమాజంలోని ఇతర వర్గాలకు కూ డా పాకుతుందని, అప్పుడు మీరంతా మళ్లీ ధర్నా చౌక్ వస్తారని, వేరే వాళ్లు అధికారంలోకి వస్తారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమ ర్శించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజలు గుమిగూడుతున్నారంటే, సచివాలయంలో మార్పునకు సంకేతమన్నారు. రాజకీయ మార్పు రాబోతుందా అనేది తెలియాలంటే ధర్నా చౌక్‌తోనే తెలుస్తోందని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. 

ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: ఏలూరి శ్రీనివాసరావు

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలేదని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు. 63 డిమాండ్లలో ఏవి పరిష్కరించారో లేదో తెలియజేయాలని, దానికి సం బంధించిన నివేదికను అధికారుల కమిటీ బహిర్గతం చేయాలని కోరారు. కొందరు అధికారులు కావాలనే ఉద్యోగుల సమస్యల ను పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు.

తమ సమస్యలను ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ, అధికారుల కమిటీ ముందు విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం మూడు నెలల్లో ఇస్తామన్న రూ.2,100 కోట్లలో కేవలం రూ.700 కోట్ల వరకే పెండింగ్ బిల్లులు విడుదల చేసిందని, మిగతావి ఇంతవరకూ విడుదల చేయలేదన్నారు. గత 20 నెలల నుంచి తమ సమ స్యలు పరిష్కారమవుతాయని ఎదురుచూశామని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేసేట్టు కనబడటంలేదన్నారు. 

 ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలి: వక్తలు

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించి, రాష్ర్ట ప్రభుత్వం విశ్వసనీ యత నిలుపుకోవాలని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూపీఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. అక్టోబర్ 12 కంటే ముం దే తమ సమస్యలను పరిష్కరించాలని కోరా రు. ప్రీప్రైమరీ విద్యను తూతూ మంత్రంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

ప్రజా ప్రభుత్వంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఉపాధ్యాయులు ఆశించారని, కానీ ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను సైతం అమలు పరచడం లేదని విమర్శించారు. ఖాళీ పోస్టులను వెం టనే భర్తీ చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు, 40 మంది దాటిన చో ట తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని డిమాండ్ చేశారు.

ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మం జూరు చేయాలని, మోడల్ స్కూల్స్ టీచర్లకు కారుణ్య నియామకాలు చేపట్టాలని తెలిపా రు. తమ సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఐక్య పోరా టాలు సాగుతాయన్నారు. ధర్నాలో అరుణోదయ విమలక్క పాల్గొని టీచర్లకు మద్దతు తెలిపారు.

కార్యక్రమంలో యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యు లు సీహెచ్ అనిల్ కుమార్, ఎం సోమయ్య, ఏ వెంకట్, ఎన్ తిరుపతి, టి లింగారెడ్డి, కొ మ్ము రమేశ్, ఎస్ హరికిషన్, జాడి రాజన్న, బి కొండయ్య, వై విజయకుమార్, జాదవ్ వెంకట్రావు, మేడి చరణ్ దాస్, దూడ రాజనర్సు బాబు పాల్గొని మాట్లాడారు. యూ ఎస్‌పీసీ భాగస్వామ్య సంఘాల నాయకులు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

లక్షమందితో చలో హైదరాబాద్: మారం జగదీశ్వర్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 12 ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నాని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ఎల్బీస్టేడియంలో లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో భారీ సభను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏదో చేస్తోందని గత 20 నెలలుగా నిరీక్షించామని, ఇక ఆగేది లేదని తేల్చిచెప్పారు. సెప్టెంబర్ పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

పాత పెన్షన్ సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేసే పోరాటానికి వేలాదిగా ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ రిపోర్టును తెప్పించుకొని దాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులను ఇవ్వమని ప్రభుత్వానికి అడుగుతున్నామని తెలిపారు. గురుకులాల్లో టైంటేబుల్‌ను మార్చాలని, పర్యవేక్షణ అధికారుల పోస్టులను మంజూరు చేయాలని ఆయన కోరారు.