24-08-2025 01:31:49 AM
బీసీ కోటా పార్టీ పరంగానా? ప్రభుత్వ పరంగానా? తేల్చేందుకు..
కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో త్వరలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని కొందరు కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించగా, మరికొందరు ఆ ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారంం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) పీసీసీ సలహా కమిటీ సమావేశం సుమారు మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మైలేజ్ తగ్గుతుందని కొందరు నేతలు తెలిపినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి సైతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళదామని స్పష్టం చేసినట్లు తెలిసింది.
బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయకోవిదులతో సంప్రదింపులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో ఒక కమిటీని సీఎం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ త్వరలో బీసీ రిజర్వేషన్లపై న్యాయ కోవిదులతో చర్చించి 26న నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదికపై ఈనెల 27, 28వ తేదీల్లో డెడికేటెడ్ కమిషన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. 29న క్యాబినెట్ సమావేశంలో చర్చించాక బీసీ కోటాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అంతకంటే ముందు సీఎం.. తమిళనాడు, బీహార్‌లో అమలవుతున్న రిజర్వేషన్లపై అధ్యయనం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశంలో ‘ఓట్ చోరీ, గద్దీ చోడ్’ ఉద్యమం, ప్రజాపాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పెండింగ్ లో ఉన్న కమిటీల ఏర్పాటు, ఉప రాష్ట్రపతి ఎన్నిక, యూరియా కొరతపై బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయంతో పాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైనే చర్చ సాగింది.
బీసీలకు న్యాయం చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం బీసీ కోటాపై ఇప్పటికే రెండు బిల్లులు అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తుచేశారు. వాటిని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిందన్నారు. పీఏసీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ దాటకుండా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ సైతం తీసుకువచ్చామని గుర్తుచేశారు. బీసీల రిజర్వేషన్ బిల్లు గవర్నర్ నుంచి రాష్ర్టపతి వద్దకు వెళ్లాయన్నారు. రాష్ర్టపతి వద్దే బిల్లులు ఆలస్యమవుతున్నాయన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.
42 శాతం రిజర్వేషన్ కు సంబంధించి రాష్ట్రపతి నుంచి బిల్లు ఆమోదం పొంది రావాలని, లేదంటే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. బీసీలకు న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ ఈనెల 28 లోపు నివేదిక ఇవ్వనున్నదని తెలిపారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయాలని ఏఐసీసీ రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు కులగణన చేసి, రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో చట్టం చేశామని వెల్లడించారు. రిజర్వేషన్లపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో పాటు మరికొందరు న్యాయకోవిదుల సలహాలు, సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ చట్టమే అడ్డంకి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
బీసీల కోటాపై గత ప్రభుత్వం తెచ్చిన చట్టమే 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకిగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకే, తమ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టిందన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే రెండు బిల్లులు చేసి అసెంబ్లీలో వాటిని ఆమోదింపచేసుకున్నామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడిగా మరో బిల్లు తీసుకొచ్చామని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్సు తెచ్చామని, ఆ ఆర్టినెన్స్‌ను గవర్నర్‌కు పంపించామని.. గవర్నర్ దానిని కేంద్రానికి పంపారని తెలిపారు. 90 రోజుల్లో రాష్ర్టపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపైన సుప్రీం కోర్టులో రాష్ట్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించామని స్పష్టం చేశారు.
బీహార్‌లో రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26న హాజరవుతున్నట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉప రాష్ర్టపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరేంటో అర్థమవుతున్నదన్నారు. ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించినందుకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఓట్ చోరీపై లోగో ఆవిష్కరణ..
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల భుజానికెత్తుకున్న ఓట్ చోరీ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఓట్ చోరీ ప్రచారానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఓటు చోరీ పెద్దఎత్తున జరిగిందని, బీజేపీ మూడోసారి ఓటు చోరీతోనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయంలో సమగ్ర సమాచారాన్ని సేకరించారని, తద్వారా ప్రజల్లోకి తీసుకె ళ్లాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రం లో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలనిస్తుందని కొనియాడారు. రైతు భరో సా, రైతు రుణమాఫీ, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం లాంటి పథకాలకు మంచి స్పందన వస్తుందన్నారు. టీ పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు.
పీసీసీ కోర్ కమిటీ భేటీ
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహం, ప్రతి వ్యూహాలపై చర్చించారు. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ముగ్గురు మంత్రులకు ఆ నియోజకవర్గ ఉపఎన్నిక వ్యవహారాలన్ని అప్పగించినందున పార్టీపరంగా బలోపేతమయ్యేందుకు ముమ్మరంగా కసరత్తు కొనసాగిస్తున్నట్లు సభ్యుల దృష్టికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉన్న ఫిర్యాదులను స్పీకర్ పరిశీలించడమే కాకుండా, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడంపైన చర్చించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశంపైన చర్చించినట్లు సమాచారం.