calender_icon.png 24 August, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది సుప్రీం తీర్పు

24-08-2025 01:23:50 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపణలపై స్పందించిన 

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 

న్యూఢిల్లీ, ఆగస్టు 23: సల్వాజుడుంపై తీర్పు తన ఒక్కడి అభిప్రాయం కాదని.. సుప్రీం కోర్టు అభిప్రాయమని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి శనివారం పేర్కొన్నారు. శుక్రవా రం హోంమంత్రి అమిత్ షా కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు తెలిపారు. 2011లో సల్వాజుడుంకు  వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు.

మావోయిస్టులపై పోరాటానికి గిరిజన యువతను ప్రత్యేక పోలీసులుగా వినియోగించడం రాజ్యాంగ విరుద్ధమని వెంటనే వారిని నిరాయుధులను చేయాలని ఆదేశించారు. అప్పట్లో ఆ తీర్పు ఇచ్చి ఉండకపోతే 2020 నాటికే వామపక్ష తీవ్రవాదం అంతరించేది’ అని తీవ్ర విమర్శలు చేశారు. 2011 జూలైలో ‘సల్వాజుడుం’పై తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు జస్టిస్ ఎస్. ఎస్ నిజ్జర్ కూడా ఉన్నారు.

దీనిపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేంద్ర హోం మంత్రి తో ఈ విషయంపై చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను. కానీ అది నా తీర్పు కాదు.. సుప్రీం కోర్టు ఇచ్చింది. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నా. తీర్పును చదివి ఉంటే ఈ కామెంట్ చేసి ఉండే వారు కాదు. ఇదే నేను చెప్పదలుచుకున్నా. ఇంతటితో చర్చను ఆపేద్దాం’ అని పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తా

అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తానని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘సామాజిక విధానాలను రూపొందించడానికి కులగ ణన సర్వే నిర్వహించాలి. ప్రజాస్వా మ్యం అంటే సంభాషణ తప్ప మరొకటి కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇద్ద రు వ్యక్తుల మధ్య పోటీ కాదు.

రెండు వేర్వేరు భావజాలాల మధ్య పోటీ. నా ఏకగ్రీవ అభ్యర్థిత్వం వైవిధ్యాన్ని, ఏకగ్రీవ ఎంపికను, జనాభాలో 64 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓటింగ్ శక్తిని సూచిస్తుంది. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్షాలు సమన్వయం చేసుకు నేవి. దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడం లేదు’ అని తెలిపారు.