calender_icon.png 15 September, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమీర్‌పేట్ వరదకు హైడ్రా బ్రేక్

15-09-2025 01:29:54 AM

-దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం

-పూడుకుపోయిన బాక్సు డ్రైన్ల పూర్తి ప్రక్షాళన

-కుండపోత వర్షంలోనూ నిలవని నీరు

-సమస్య మూలాలను గుర్తించడమే విజయం

-హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): చినుకు పడితే చెరువును తలపించే అమీర్పేటకు దశాబ్దాల నాటి వరద కష్టాలు తీరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ హైడ్రా పక్కా ప్రణాళికతో చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆదివారం నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తినా, అమీర్పేట లో మాత్రం వరద నీరు నిలవకుండా సాఫీ గా సాగిపోయింది. పూడుకుపోయిన బాక్సు డ్రైన్లను ప్రక్షాళన చేయడంతో సాధ్యమైంది.

గతంలో చిన్నపాటి వర్షానికే అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకునేవి. అయితే, ఆదివారం భారీ వర్షం కురిసినప్పటికీ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపించింది. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ, మధురానగర్ వంటి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా పోటెత్తిన వరద నీరు, అమీర్పేట వద్ద ఎక్కడా ఆగకుండా సాఫీగా ముందుకు సాగిపోయింది. ఇటీవల జీహెచ్‌ఎంసీతో కలిసి హైడ్రా మైత్రివనం వద్ద పూడుకుపోయిన బాక్సు డ్రైన్లలోంచి భారీ మొత్తంలో పూడికను తొలగించడమే ఇందుకు కారణం. భారీ వర్షం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించిన హై డ్రా సిబ్బంది, వరద నీరు సాఫీగా వెళ్తుండటంతో ఊపిరి పీల్చుకున్నారు.

సమస్య మూ లాలను తెలుసుకుంటే పరిష్కారం సులభం అనడానికి అమీర్పేట వరద ముప్పు తొలగడమే ఒక ఉదాహరణ అని హైడ్రా కమి షనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదేశాలు ఇవ్వడంతో, సంబంధిత శాఖలన్నీ కలిసి అధ్యయనం చేశాయి. అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్న మూడు ప్రధాన బాక్సు డ్రైన్లలో ఒకటి పూర్తిగా, రెండు సగానికి పైగా పూడుకుపోయినట్లు గుర్తించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన ఈ పూడికను పైనుంచి తవ్వి తొలగించారు. ఈ క్రమంలో డ్రైన్ల నుంచి పరుపులు, తలదిండులు, భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయ టపడటం గమనార్హం. నగరంలో నీట మునుగుతున్న ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో సమస్య మూలాలను గుర్తించి, పరిష్కారాలు చూపేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది. అమీర్పేట మోడల్తో త్వరలోనే నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.