15-09-2025 01:28:56 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషావేత్త, హైదరాబాద్ రాష్ట్రానికి తొలి , చివరి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావుకు రాష్ర్ట ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని, జీహెఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న బూర్గుల విగ్రహానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ర్ట రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు రాష్ట్రాభివృద్ధికి ఆనాడు వేసిన బీజాలు, నేటికీ దినదినాభివృద్ధి చెందుతూ ఫలాలను అందిస్తున్నాయి అన్నారు. ఆయన రాజకీయాల్లో నిజాయితీకి మారుపేరుగా, అభివృద్ధికి దిక్సూచిగా నిలిచారు అని మంత్రి కొనియాడారు.వారి కుటుంబ సభ్యులు నేటికీ వివిధ ఉన్నత హోదాల్లో సమాజానికి సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. బూర్గుల రామకృష్ణారావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.