25-09-2025 12:31:03 AM
తుర్కయంజాల్, సెప్టెంబర్ 24: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులోని ఎర్రకుంట చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి చెరువు అలుగు, తూము, స్లూయిజ్ ప్రాంతాలను పరిశీలించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రకుంట పూర్తిగా నిండి అలుగు పారుతోంది. అయితే అలుగు పారే ప్రాంతంలో కల్వర్టు నిర్మాణానికి భారీ గోయిలా తవ్వడంతో తొర్రూరు-బ్రాహ్మణపల్లి మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు చెరువును సందర్శించారు.
ఇరిగేషన్ అధికారులను అడిగి చెరువు పూర్వపరాలను తెలుసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ వంశీధర్ హైడ్రా అధికారులకు కూలంకశంగా వివరించారు. అన్ని పత్రాలను అధికారులకు అందజేశారు.
అనంతరం ఆర్ అండ్ బీ అధికారులతో రోడ్డు పరిస్థితిపై వివరాలు తీసుకున్నారు. తదనంతరం హైడ్రా అధికారులు మాట్లాడుతూ చెరువు పైభాగాన ఉన్న రైతులను, అలుగుతో నష్టపోతున్న రైతులను ఆఫీసుకు రావాలని సూచించారు. త్వరలోనే హైడ్రా కమిషనర్ తో సమావేశం ఏర్పాటు చేసి చెరువు అలుగుపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.