calender_icon.png 19 August, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్‌వాలాను నేను!

04-01-2025 12:00:00 AM

1970వ దశకంలో హైదరాబాద్ సిటీలో ఎక్కువగా సైకిళ్లు తిరిగేవి. నేనూ కొత్త సైకిల్ కొందామని అనుకున్నాను గాని, దాని వెల 500 రూపాయలు. ఎక్కడి నుంచి తేగలను? మాది నిరుపేద కుటుంబమాయె. పాత పట్నంలోని గౌలిపురాకు నివాసం మార్చిన తర్వాత బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్తుకు ఎక్కువగా నడిచే వెళ్లేవాణ్ణి. అప్పుడప్పుడు బస్సులో వెళ్లేవాణ్ణి. బస్సెక్కాలంటే చార్మినార్ దాకా నడవాలి.

సైకిల్ నడపడమంటే నాకు చాలా ఇష్టం. ఒక సైకిల్ పాతదైనా కొనుక్కుంటే బాగుండుననిపించింది. పరిషత్తు ప్రాచ్య కళాశాలకు వెళ్లేటప్పుడు తరచుగా సైకిల్ కిరాయికి తీసుకునేవాణ్ణి. అది గంటకింత అని ఉండేది. దానికి పంక్చర్ ఐతే బాధ్యత మనదే. పోలీసు పట్టుకుంటే మనమే దండగ కట్టాలి. టైర్ పంక్చర్ ఐతే ఒక్కోసారి గాలి కొట్టించుకోవడానికి పైసలుండేవి కావు. 

ఒకరోజు గౌలిపురాలో టైర్ పంక్చర్ ఐతే, గాలికొట్టే  వ్యక్తి “సార్! ఎన్ని రోజులని కిరాయి సైకిలుమీద పోతారు? ఒక కొత్త సైకిలు కొంటే సరిపోతది కదా!” అన్నాడు. “కొత్త సైకిలు కాదు, పాత సైకిలు కొంటానికి కూడా నా దగ్గర డబ్బు లేవయ్యా..” అన్నాను. 

దానికి అతడు “మీరు పాత సైకిలు కొంటానంటే నేనిస్తాను” అన్నాడు. ‘ఇది బాగుంది. కాని అతడెంతకు ఇవ్వగలడో?’ అని సందేహిస్తూ, “ఎంతకిస్తావు?” అన్నాను. “40 రూపాయలకిస్తాను. తీసుకుంటారా?” అన్నాడు. నాకు ఆశ్చర్యంతోపాటు ఆనందమూ కలిగింది. నేను ఓకే అనగానే అతడు తన సైకిలు రిపేరింగ్ షాప్ లోంచి ఒక సైకిలు నా ముందుంచి “ఇదే సైకిలు, నడిపి కూడా చూసుకో. తర్వాతనే తీసుకో..” అన్నాడు నమ్మకం. 

నాలుగు నెలల ట్యూషన్ డబ్బు

వెంటనే నేను ఆ సైకిలెక్కి కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చాను. పాతదైనా ఎంతో వేగంగా పోగలిగిన ఆ సైకిలు నాకెంతో నచ్చింది. 4 నెలలుగా ట్యూషన్ చెప్పడం వల్ల వచ్చిన డబ్బులో నిజంగా నా దగ్గర 40 రూపాయలే మిగిలాయి. వెంటనే రూంకు వెళ్లి ఆ డబ్బు తెచ్చి ఇస్తూ, అనుమానంతో అడిగాను “ఇది దొంగ సైకిలు కాదుకదా?” “లేదు సార్. దీన్ని నేనే తయారుచేశాను.

నా దగ్గరికి సైకిళ్లు తీసుకుని వచ్చిన వాళ్లు నడపలేనప్పుడు నాకే అప్పగిస్తారు. చెడిపోయిన భాగాలను మరమ్మతు చేసి ఇస్తాను. కొత్త విడిభాగాలను అమరుస్తాను. పాడైన వాటిని బాగు చేస్తాను. అట్లా నిర్మాణమైందే ఈ సైకిలు..” అని అతడు నేను కొనబోయే సైకిలు చరిత్రను చెప్పాడు. “సార్! మీకేం భయం లేదు. ఎన్నో సైకిళ్లు విడిభాగాలే ఈ సైకిలుకు ఆధారం. మీరు నిక్షేపంగా ఈ సైకిలును నడుపుకోవచ్చు” అన్నాడు. 

అతని మాటలమీది నమ్మకంతో సైకిలు కొని ఇంటికి తెచ్చాను. బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టాను. ఓ పూలమాల సైకిలు మెడలో వేసి పూజ చేశాను. చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి నడిపించాను. కానీ, ఒక్క నిమ్మకాయయినా చితికి పోలేదు.  40 రూపాయలకే సైకిలు నా చేతికి వచ్చినందుకు ఆ భగవంతునికి దండం పెట్టాలి. కానీ, ఆ సైకిలుకు ఎన్ని దండాలు పెట్టానో నాకే గుర్తు లేదు.

నా విద్యార్థి జీవితానికి ఆ సైకిలు ప్రత్యక్ష సాక్షి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని తెలిసిన వారికి చెప్పడానికి వెళ్లినప్పుడు ఆ సైకిలే తోడుగా నిలిచింది. వివాహం అయ్యాక నా అర్థాంగి ప్రమీలను వెనక కూర్చో బెట్టుకుని గౌలిపురాలోని ‘అప్సరా’, ‘సుధా’, చాదర్‌ఘాట్‌లోని ‘కమల్’ టాకీసులకు వెళ్లిన రోజులు వున్నాయి. నా పాత సైకిలు చూసి చాలామంది జాలి పడేవారు. 

పాతపట్నంలోని గౌలిపురా నుంచి సికింద్రాబాద్‌లోని వారాశిగూడకు నివాసం మార్చిన తర్వాత కూడా ఆ సైకిలు నన్ను వెన్నంటే ఉంది. ఉద్యోగం దొరికాక కూడా కొత్త సైకిలు కొనాలన్న అభిప్రాయాన్ని నాలో కలిగించలేదు. ఆ పాత సైకిలు నాకెంత తోడ్పడిందో మాటల్లో చెప్పలేను. విధి లేక 100 రూపాయలకు దాన్ని అమ్మేసేప్పుడు మాత్రం నా రెండు కళ్లూ మూసుకున్నాను. మనసు చివుక్కుమంది. అదిప్పటికీ నా కళ్లలో నిక్షేపంగా ఉంది.

 ఆచార్య మసన చెన్నప్ప