11-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): నేను డాక్టర్‌ను కాదని, కానీ సోషల్ డాక్టర్‌ను అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సమాజంలోని రుగ్మతలను గుర్తించి వైద్యం చేస్తానన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ జరగడం సంతోషమని, భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా ఇక్కడకు వచ్చిన యువ కార్డియాలజిస్టులు అందరికీ స్వాగతం పలికారు.
మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాల జిస్టులు అని, అయినా మీ నాలెడ్జ్ ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కాన్ఫరెన్స్‌కు వచ్చారని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమన్నారు. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌లో జరగడం ఎంతో గర్వకారణమని చెప్పారు. లైఫ్ సెన్సైస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. మనుషులపట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని సూచించారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సీఎం అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరిం చాలని పిలుపు నిచ్చారు. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయని, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉందన్నారు.
అందుకే లేటెస్ట్ టెక్నాలజీపై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దని సూచించారు. ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని మీకు తెలు సు అని, గుండె జబ్బులను నివారించే మిషన్‌లో మనమందరం భాగస్వాములం అవు దామని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దామన్నారు.
ఉదాహర ణకు విద్యార్థులకు సీపీఆర్ బోధించడానికి మీరు స్వచ్ఛం దంగా ముందుకు రాగలిగితే మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలమని, చాలా సార్లు మనం నివారణ గురించి నిర్లక్ష్యం చేస్తుంటామని చెప్పారు. కానీ ప్రజలకు అవగాహన కల్పించగలిగితే సమాజం ప్రయోజనం పొందుతుందని, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని కోరారు. ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడుగా ఎదిగేందుకు ప్రయత్నించాలని సూచించారు.