జమిలి పోగు కథలు.. పచ్చిగాయాలుగా కన్నీరు తెప్పిస్తాయి. కథల్లోని ప్రతి పాత్ర మనవైపు తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రవేశించి తమ ప్రతిభతో రాణించిన స్త్రీల జీవితాలను చాలా దగ్గర నుంచి చూసి వాటిలో వారు రాటుతేలే విధానాన్ని మానవీయకోణంలో చూపిస్తాయి. నాన్ జడ్జెంటల్‌గా, అత్యుత్సాహంతో ఒక పక్షం వైపు నిలబడి రాస్తున్నట్లు కాకుండా ‘ఇప్పుడు జీవితం ఇలా ఉంది, నువ్వెలా నిర్ణయించకుంటావో నీ ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. ‘జమిలి పోగు కథలు’ ద్వారా తెలుగు సాహిత్యంలోకి అడుగు పెట్టారు రుబీనా పర్వీన్. బతుకు చిత్రాలే కథలుగా మలిచిన సింగరేణి బిడ్డ విజయక్రాంతితో పంచుకున్న ముచ్చట్లు..
నా బాల్యమంతా నాన్నమ్మ దగ్గరే గడిచింది. అక్కడే ఆడుకుంటూ టైమ్ వృథా చేస్తున్నానని.. మా నాన్నగారు ముప్పుయి ఇంగ్లాండ్ లెటర్స్ కొనిచ్చేవారు. ఆ లెటర్స్‌లో మా స్కూల్లో ఆరోజు ఏం జరిగిందో మొత్తం రాసి.. ఉదయం పోస్టు డబ్బాల్లో నాన్నకు పంపించేదాన్ని. అలా రాసే అలవాటు నాకు ఆరేండ్ల నుంచే మొదలైంది. అలా ప్రతిది పేపర్‌పై పెట్టడం ఒక అలవాటుగా మారింది. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. నన్ను పట్టుకోవడం కూడా ఎవరి వల్ల కాకపోయేదని ఇంట్లోవాళ్లు చెబుతుంటారు.
అప్పుడు మా నాన్న నన్ను ఎలా కంట్రోల్ చేయాలని మా అమ్మకి పెద్ద బాల శిక్ష తెచ్చి ఇచ్చారు. దాన్ని రోజు నాతో చదివించమని అమ్మకు చెప్పివెళ్లారు. అలా ఐదేళ్లు వచ్చే సరికి పెద్దబాల శిక్ష చదవడం పూర్తి చేశాను. ఆ సందర్భంగా మా నానమ్మ ఊరు ఊరంతా పిలిచి భోజనాలు పెట్టించింది. మా మనవరాలు పెద్ద బాలశిక్ష మొత్తం చదువుకుందని అందరితో ఎంతో గొప్పగా చెప్పేది. వచ్చినవాళ్లంతా నిజమా? కాదా? అని చెక్ చేసుకునేది. అప్పుడే నా మైండ్లో పడిపోయింది. ఏ పని చేసిన గెలవాలనే తాపత్రయం వచ్చేసింది. ఒక విధంగా క్రెడిట్ అంతా మా నానమ్మదే.
సింగరేణి పైసలకు.. అర్కత్, బర్కత్ ఉండదు!
నేను పుట్టింది ఖమ్మం దగ్గర గార్లబయ్యరంలో.. తర్వాత ఇల్లందుకు వచ్చాం. మా అమ్మ, నాన్న సింగరేణి ఉద్యోగులు కాదు. మా నాన్న ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, అమ్మ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసేది. మా చుట్టూ పక్కలంతా సింగరేణి ఉద్యోగులు. నా ఫ్రెండ్స్ కూడా కోల్ ఫిల్లర్స్ పిల్లలే. మా నానమ్మ బట్టల వ్యాపారం చేసేది. మా ఇంటికి వచ్చి చాలామంది బట్టలు కోనేది. అలా వాళ్ళతో నాకు అనుబంధం ఎక్కువ. వాటికి సంబంధించిన లెక్కలన్నీ నేనే రాసేది. ఎందుకంటే మా నానమ్మ చదువుకోలేదు. సింగరేణిలో నేను గమనించిన వాటిని ఓ కథలో రాశాను. ‘సింగరేణి పైసలకు.. అర్కత్, బర్కత్ ఉండదు’ అని రాశాను. ఎందుకంటే ఎనిమిదో తారీఖు వచ్చే సరికి డబ్బులు వచ్చేవి.. 20 తారీఖు నుంచి పస్తులు ఉండేవాళ్లను ఎంతోమందిని చూశాను.
మీరు పత్రికలో పని చేశారు కదా?
పుస్తక రూపంలో తీసుకురావడానికి ఇంత టైమ్ ఎందుకు పట్టింది?
నా 17 ఏండ్ల్ల వయసులో జర్నలిజంలో అడుగుపెట్టా. అలా చాలా ఆర్టికల్స్ రాశాను. స్టింగర్‌గా మొదలైన నా జీవితం రిపోర్టర్‌గా.. స్టాప్ రిపోర్టర్ స్థాయికి చేరుకున్నా. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వైపు వెళ్లా. అక్కడ చాలా నేర్చుకున్నాను. అయితే ఎప్పటి నుంచో కథలు అనేవి రాస్తున్నా.. అలా దాదాపు ఒక 30 కథలకు పైగా రాశాను. అలా రాసిన వాటిని పుస్తకం వేసుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. అప్పుడప్పుడు పబ్లిష్ అవుతున్నాయి కదా అనుకున్నా. ఈ విషయంలో కొంచెం అశ్రద్ధ కూడా చేశా.. పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ప్రొఫెషన్ లైఫ్‌లో బిజీ వల్లే ఇలా జరిగింది అంతే! ఈ 24 ఏళ్లు బిజీ బిజీగా గడిచిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేశా. దాదాపు 540 డాక్యుమెంటరీ ఫిల్మ్స్, 380 యాడ్ ఫిల్మ్స్ చేశా పెద్ద పెద్ద కంపెనీలకు. ఒక పీక్ లెవల్‌కు వెళ్లాక ఏం చేయాలో కూడా తోచదు కదా!
ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం
చాలా సీరియస్‌గా కెరీర్‌పై దృష్టి పెట్టాను. తర్వాత పెళ్లి.. పాప.. ఇవన్నీ జీవితంలో సహజంగా ఉండేవే కదా. జీవితమన్నాక కష్టాలు.. నష్టాలు సహజం!
వీటిన్నంటిని దాటుకుంటూ నడుస్తున్నా.. ఏవైనా బాగా మనసును కష్టపెట్టినప్పుడో.. మనసుకు బాగా సంతోషం వేసినప్పుడో.. మనసు కొన్ని నెలల పాటు దిగులు పడుతుంది. అలాంటి సమయంలో నేను చూసిన యదార్థ ఘటనలు, నన్ను భావోద్వేగంలో ముంచిన సంఘటనల ఆధారంగా హృదయాలను హత్తుకునేలా మానవీయకోణంలో ‘జమిలి పోగు కథలు’ రాశాను.
దేవ్లీ అనే మహిళ గురించి రాశారు?
ఆమె ఎలా పరిచయం?
మా ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లే దారిలో ఎడమ చేతివైపు దేవ్లీ ఇళ్లు ఉండేది. ఆమె పదో తరగతి వరకు చదువుకుంది. చిన్నవయసులోనే పెళ్లి చేశారు. దేవ్లీ భర్త చాలా మంచి వ్యక్తి. ఇద్దరు మా ఇంటికి వచ్చేవారు. విషాదం ఏంటంటే.. సింగరేణి బ్లాస్టింగ్ సమయంలో దేవ్లీ భర్త చనిపోయారు. తర్వాత ఆమె జీవితం తారుమారైంది. దాంతో ఊర్లో వాళ్లంతా దేవ్లి గురించి చెడుగా మాట్లాడుకునేవారు. అవన్నీ ఇప్పటికి బాగా గుర్తున్నాయి. దేవ్లి జీవితం గురించి తలుచుకుంటే ఇవాళ్టి కూడా మనసు బరువుగా అనిపిస్తుంది.
శోక ప్రకటన అంటే?
రాజస్థాన్‌లో అమ్మాయి జన్మిస్తే శోక ప్రకటన చేస్తారు. అందరు కాదు.. ఒక 30 శాతం మంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. పాప జన్మించిన 40 రోజులకు గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ తెలికుండా చూసుకుం టారు ఉదయం నాలుగు గంటలకు గుడిలో పూజ చేస్తారు. అమ్మాయిల పెంపకంలో కూడా చాలా తేడా కనిపిస్తుంది. అది నేను దగ్గర నుంచి చూశా. రాజస్థాన్‌లో మా ఫస్ట్ ప్రాజెక్టు లాంచింగ్ అప్పుడు ఐదు వేలమంది వచ్చారు. అప్పుడు మా పాప వయసు పదేళ్లు. తాను నాతో ఇలా అంది. ‘మమ్మీ మనిద్దరమే గర్ల్స్ ఇక్కడ.. ఇంకేవరూ లేరేంటి’? అని అడిగింది.
అప్పుడు నేను రియాలైజ్ అయ్యా. ఒక్క అమ్మాయి కూడా లేదు. అందరు మగవాళ్లే. ఎవరూ రావడం లేదని. ప్రాజెక్టులు ఆడవాళ్ల పేరు మీద ఉన్న వాళ్లు రారు. అప్పుడే తెలిసింది పాప పుడితే శోక ప్రకటన చేస్తారని. అందుకే శోక ప్రకటన కథ రాశాను. ఆడ పిల్ల పుడితే.. శోక ప్రకటన కాదు చేసేది.. సంతోష ప్రకటన చేయాలని కథ రాశా. రాజస్థాన్‌లో అమ్మాయిల జీవితం ఆధారంగా రాసిన కథ అది. ఇప్పటికీ రాజస్థాన్‌లో “ఆడ ఒంటె పుడితే బెల్లం పంచుతారు.. ఆడ పిల్ల పుడితే కుండ పగలగొడతారు”. ఇది ఎంతో బాధకరమైన ఘటన. ఈ కథ రాయడానికి చాలాసార్లు ఏడ్చాను. తల్చుకుంటేనే గుండె బరువువెక్కుతుంది.
తమ్ముడి మరణంతో..
2014లో తమ్ముడు చనిపోయాడు. వాడు చనిపోయాక ఒక ఆలోచనలో పడ్డా. నాకు నేను ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాను. జీవితంలో ఎంతో సాధించాను? దేని కోసం? ఎవరి కోసం? అనే ప్రశ్నాలతో.. జీవితాన్ని ప్రారంభించాను. జీవితం చాలా చిన్నది. అలా మా తమ్ముడు దూరమయ్యాక.. సమాజానికి ఉపయోగపడే పనులే చేయాలని డిసైడ్ అయ్యా. అందుకే మీడియాను వదిలి పెట్టి.. సోషల్ ఆంత్రప్రెన్యూర్‌గా జర్నీ మొదలు పెట్టాను. అలా ఇప్పటి వరకు 7,000 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించా, రెండు నేషనల్ అవార్డ్సు, యూఎన్ సర్టిఫికేషన్, చాలా ఇంటర్నేనల్ అవార్డ్సు వచ్చాయి. ఇవన్నీ గొప్ప అని నేను చెప్పను కానీ, మనం చేస్తున్న పనికి గుర్తింపు వచ్చిందని సంతోషిస్తా.
చిన్న కథలే ఎంచుకోవడానికి కారణం?
చిన్నకథల ద్వారా విషయాన్ని అర్థవంతంగా చెప్పొచ్చు. ఒకే సమయంలో ఎక్కువ కథలను పాఠకులకు పరిచయం చేయొచ్చు. ఉదాహరణకు ఒక నవల ఎంచుకుంటే ఒకే కథను 200 పేజీలు రాస్తాం. కానీ నేను తిరిగే ప్రదేశాలన్నీ వైవిద్యభరితమైన ప్రదేశాలు. నా జమిలి పోగు కథల్లో ‘మక్సుదా’ అని ఒక టెర్రరిస్టు భార్య కథ ఉంటుంది. ఒక టెర్రరిస్టు ముద్రతో భర్త జైలుకు వెళ్తే.. ఆ అమ్మాయిపడే బాధలు వర్ణానతీతం. బయటకు రాలేదు, వచ్చినా.. పని దొరకదు. కష్టాలకు ఎదురీది ఒక చిన్న ఆధారం దొరికితే కోర్సు నేర్చుకొని జీవితాన్ని ఎలా మలుచుకుందో ఆ కథలో స్పష్టంగా ఉంటుంది. ఇది వాస్తవంగా జరిగిన కథ.
నక్సలైట్ మామయ్యలే అంటా!
నిజానికి ఒక రచయితగా, ఫిల్మ్ మేకర్‌గా, ఆంత్రోప్రెన్యూర్‌గా నాపై నక్సల్స్ ప్రభావం కాస్త ఎక్కువే. ఎందుకంటే మాది కొంచెం అటవీ ప్రాంతం. మా ఏరియాను అప్పట్లో నక్సల్ ప్రభావిత ప్రాంతం అనేవారు. కానీ నేను అలా.. అనను. వాళ్లు లేకపోతే నేను ఇవాళ ఈ స్థాయి వచ్చేదాన్ని కాదు. ఎందుకంటే నా చిన్నతనంలో మా ఊర్లో పోలీసు పెట్రోలింగ్ అయిపోయాక.. నక్సలైట్స్ వచ్చి.. ఊర్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే పరిష్కారం చేసేది. సహజంగా అందరు నక్సలైట్స్‌ను అన్నలు అంటారు. కానీ నేను మాత్రం నక్సలైట్ మామయ్యలు అంటా.. ఎందుకంటే మా అమ్మను వాళ్లు అక్క అని పిలిచేది. వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నా.. సోమియట్ సాహిత్య ప్రభావం, స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం, ఆర్థిక సమానత్వం వంటి పదాలను చిన్నతనంలో వాళ్లదగ్గర నుంచే నేర్చుకున్నా. నేనేం ఉద్యమంలోకి వెళ్లలేదు కానీ, వాళ్ల పుస్తకాల ప్రభావం నాపై ఎక్కువగా పడ్డది.
పుస్తకంలో..
‘జమిలి పోగు కథలు’ రుబీనా మొదటి కథా సంకలనం. ఇందులో 12 కథలు ఉన్నాయి. వాటిలో 1. ఖులా, 2. అబ్బాజాన్, 3. పి.ఎం.ఎస్, 4. వడగండ్ల వాన, 5. బుర్ఖా, 6. మక్సుదా, 7. వన్ పర్సన్ కంపెనీ, 8. తోడు, 9. శోక ప్రకటన, 10. స్కిజో ఫ్రీనియా, 11. రంగుల కల, 12. దేవ్లీ. ‘నేను స్త్రీల కోసం, స్త్రీల గురించి, ఒక స్త్రీగా ఈ కథలు రాస్తున్నాను’ అని ప్రకటన చేస్తున్నట్టుగా ఉండవు. అవి జీవితాలు. అందులో స్త్రీలు, పురుషులు ఉంటారు. వారి వారి సమస్యలతో ఉంటారు. స్త్రీలకూ ఎక్కువ అవకాశం ఉన్న సమాజం కాబట్టి ఈ కథలు ఇలాగే ఉంటాయి. అవి పాఠకులు కన్విన్స్ అయ్యేలా రాసే నేర్పు రుబీనా పర్వీన్ వద్ద ఉండటంతో ఈ కథలు చాలా సమతుల్యతను పొందాయి.
అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే!
తప్పులనేవి మానవ సహజం. ఏదైన రిలేషన్‌లో అమ్మాయిలు మోసపోతే ఆత్మహత్య చేసుకోవడమో.. లేదా నలుగురిలో నవ్వుల పాలవ్వడమో జరుగుతుంది. ప్రతిదానికి అలా ఎమోషన్ అవ్వొద్దు. మగవాళ్లు ఒక తప్పుని ఎలా హాయిగా దాటేసి వెళ్లిపోతారో.. అమ్మాయిలు కూడా అదే చేయాలి. తప్పు జరిగింది.. జరిగితే ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అని రియాలైజ్ అయ్యి ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా కెరీర్‌ను, పర్సనల్ లైఫ్‌తో పోల్చుకోకూడదు. రెండింటిని విడివిడిగా చూసి వాటికి పరిష్కారాలు వెత్తుకోవాలి. ఒకవేళ తప్పులు జరిగిన ప్రాణాలు తీసుకొద్దు. అలా మరోసారి జరగకుండా చూసుకోవాలి.
రూప