calender_icon.png 14 October, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

13-10-2025 10:04:30 PM

కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూ సంబంధిత సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం పేర్కొన్నారు. సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు, మొఖా, సర్వే నెంబర్లు ఇతర పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామని, ఇందు కోసం తహసిల్దార్, ఆర్.ఐ. లతో బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మిస్సింగ్ సర్వే నెంబర్, ప్రాంతాల మార్పు, ప్రభుత్వ భూములు, సాదాబైనమా, అటవీ భూములు, హద్దుల నిర్ధారణ, ఇతర భూములకు సంబంధించి భూ భారతి కార్యక్రమంలో పొందిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. భూ వివాదాలపై న్యాయస్థానం కంటే ముందు తమను సంప్రదిస్తే సమగ్ర విచారణ జరిపి అసలైన పట్టదారులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, న్యాయస్థానాలలో కొనసాగుతున్న భూ వివాదాలకు సంబంధించిన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోమన్నారు. 

కలెక్టర్ ను సన్మానించిన మహమ్మదాబాద్ గ్రామస్తులు..

జిల్లాలోని జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామానికి సంబంధించిన భూ సమస్యలను అతి తక్కువ సమయంలో పరిష్కరించినందుకు గ్రామస్తులు సోమ వారం కలెక్టర్ ను కలెక్టర్ ఛాంబర్ లో శాలువాతో ఘనంగా సత్కరించి మొక్కను అందజేశారు. జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 457 ఎకరాలకు సంబంధించిన 170 కుటుంబాలు దాదాపు 100 సంవత్సరాలుగా భూ సమస్యలతో బాధపడుతుండగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి పరిష్కరించారు. కలెక్టర్ ఇందు కోసం ప్రత్యేక చొరవ చూపించడం వల్లనే ఇది సాధ్యమైందని గ్రామస్తులు ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.