నేలపైనే మధ్యాహ్న భోజనం
- వెల్దుర్తి జెడ్పీహెచ్ విద్యార్థుల అవస్థలు
- అసంపూర్తిగా డైనింగ్‌హాల్ నిర్మాణం
- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
వెల్దుర్తి, ఆగస్టు 30: వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని నేలపైనే కూర్చొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో విద్యార్థుల కోసం డైనింగ్‌హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 లక్షల నిధులు మంజూరు చేసింది. అయితే హాల్ నిర్మాణ పనులు పూర్తయినా హాల్‌లో ఏర్పాటు చేయాల్సిన ఫర్నీచర్, కరెంట్, టేబుళ్లు సమకూర్చకపోవడంతో ప్రతిరోజు విద్యార్థులు ఆరుబయటే కింద కూర్చొని తినాల్సి వస్తోంది.
వర్షం పడితే భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు అందకపోవడం వలనే డైనింగ్ హల్‌లో సౌకర్యాల కల్పనలో జాప్యం జరుగుతోందని సంబంధిత కాంట్రాక్టర్ చెబుతున్నారు. ఉన్నతాధికా రులు స్పందించి నిధులు విడుదల చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
రూ.15 లక్షలు రావాల్సి ఉంది
పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.25 లక్షలే విడుదలయ్యాయి. మిగతా రూ.15 లక్షలు విడుదలైతే ఫర్నీచర్ ఏర్పాటు చేయిస్తాం. సెప్టెంబరు చివరి వారంలో బిల్లులు వచ్చే అవకాశం ఉంది.
సంతోష్, ఏఈ పంచాయతీరాజ్, వెల్దుర్తి






