నేను సినీకార్మికుల వైపు ఉంటా: సీఎం
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల సినీకార్మికుల సమ్మె తరుణంలో సీఎం నిర్మాతలతో సమావేశమయ్యారు. ఫెడరేషన్ నాయకులతోనూ మాట్లాడుతానని అప్పుడే తెలిపారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం.. ఫెడరేషన్ నాయకులతో సమావేశమయ్యారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది.
సినీకార్మికులను విస్మరించొద్దని నిర్మాతలకు చెప్పా. సమస్యను సమస్యగానే చూస్తా.. వ్యక్తిగత పరిచయాలకు ప్రాధాన్యం ఇవ్వను. కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. నేను కార్మికుల వైపు ఉంటా. ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలో చర్చించుకొని చెప్పాలి. స్కిల్ యూనివర్సిటీలో సినీకార్మికులకు శిక్షణ ఇస్తాం. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో అన్ని భాషా చిత్రాల షూటింగ్ జరిగేలా సహకరించాలి. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలి. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నాయకులు పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో సహకరించాలి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో సీఎం భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తాజా భేటీ సందర్భంగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలని సీఎం ఫెడరేషన్ నాయకులను కోరినట్టు సమాచారం.






