గ్యారెంటీలు అమలైతే పోటీ చేయను

28-04-2024 12:50:45 AM

l కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం 

l ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

l ఒక్క గ్యారెంటీ ఇచ్చి అన్నీ ఇచ్చామని అబద్ధాలు

l బస్సుల్లో ఉచితం తప్ప ఏం చేసిందో చెప్పాలి

l బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

కరీంనగర్/ చొప్పదండి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసినట్టు నిరూపిస్తే తాను లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత కోడూరు మహేందర్‌గౌడ్ తదితరులు శనివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో బండి మాట్లాడుతూ.. ‘వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ వాళ్లు మాట తప్పారు. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నరు. నేను సవాల్ చేస్తున్నా. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటా. అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమే. నిరూపించకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా? దమ్ముంటే కాంగ్రెస్ నేతలు నా సవాల్‌ను స్వీకరించి చర్చకు తేదీ, సమయం చేయాలి’ అని పేర్కొన్నారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు.  

ఫైటర్స్ వర్సెస్ చీటర్స్

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు చీటర్స్‌కు ఫైటర్‌కు మధ్య జరుగుతున్న పోరాటమని బండి అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానానికి వచ్చిన బండి, అక్కడి వాకర్స్‌తో కాసేపు ముచ్చటించారు. బీజేపీకి ఓటేయాలని అభ్యర్ధించారు. యువతతో కలిసి కాసేపు క్రికెట్, వాలీబాల్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు. ‘ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు తమది ముస్లింల పార్టీ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్తున్నారంటే ఎవరిది పాకిస్థాన్ జట్టో ప్రజలకు అర్ధమైంది. బీజేపీ భారతీయ ఆత, హిందూత్వ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న పార్టీ’ అని పేర్కొన్నారు. 

మోదీ హ్యాట్రిక్ పక్కా

నరేంద్రమోదీ హ్యాట్రిక్ ప్రధాని కావటం పక్కా అని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే ముగిసిన రెండు విడుతల పోలింగ్‌లో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నట్లు స్పష్టమైందని అన్నారు. బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ కూటమితో కలిసి 400కుపైగా స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల ఓటమి ఇప్పటికే ఖాయమైందని అన్నారు. కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకొనే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కాళోజీ చెప్పినట్లుగా ఆంధ్రా పాలకులను తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు.. మోసం చేసిన బీఆర్‌ఎస్ పార్టీని పాతాళానికి తొక్కబోతున్నారని తెలిపారు.