calender_icon.png 28 November, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను అన్ని షిఫ్టుల్లో పనిచేస్తా, కానీ..

28-11-2025 12:43:53 AM

ఇటీవల చిత్రపరిశ్రమలో పనిగంటలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ నటి దీపికా పడుకొణె తరుచూ ఈ విషయంపై స్పందిస్తోంది. మరికొందరు ‘వ్యక్తిగత జీవితం ఉంటుం ది.. 8 గంటలే పనిచేస్తాం’ అని అంటుంటే, ఇంకొందరు మాత్రం ‘ఇది ఉద్యోగం కాదు.. సినిమా షూటింగ్ దానికి తగ్గట్టు ఎప్పుడైనా పనిచేస్తాం’ అని చెప్తున్నారు. తాజాగా ఈ అంశంపై దక్షిణాది భామ కీర్తి సురేశ్ స్పందించింది.

ఈ భామ నటించిన ‘రివాల్వర్ రీటా’ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేశ్ టాలీవుడ్ మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో ఆమెకు పనిగంటలపై ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి సురేశ్ సమాధానమిస్తూ.. “నేను ఉదయం 9 నుంచి సాయత్రం 6 వరకు, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, అవసరమైతే ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పనిచేస్తా. నేను ‘మహానటి’కి పనిచేసే సమయంలో ఇంకో 5 సినిమాలు కూడా చేశాను.

అప్పుడు ఒక సినిమా పొద్దున, ఒక సినిమా రాత్రి చేశాను. నా వ్యక్తిగతంగా నేను అన్ని సమయాల్లో పనిచేస్తాను. కానీ సాధారణంగా ఒకరోజు ఏం జరుగుతుందో మీకు తెలియాలి. అందరూ 9 నుంచి 6 అని ఎందుకు అంటారంటే మేము 9కి షూటింగ్ సెట్‌లో సిద్ధంగా ఉండాలంటే ఉదయం 5 గంటలకే నిద్రలేచి పనులన్నీ మొదలుపెట్టాలి. సాయంత్రం 6 గంటలకు షూటింగ్ అయిపోతే అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్లేసరికి రాత్రి 9 గంటలవుతుంది. పనులు చేసుకొని పడుకునేటప్పటికి 10 గంటలవుతుంది.

ఇన్ని ఉంటాయి. ఒక్కోసారి టైమ్ 11 దాటుతుంది. కానీ, మళ్లీ పొద్దున్నే లేవాలి. ఈ క్రమంలో 8 గంటల నిద్ర కూడా ఉండదు. ఇక 9 టు 9 అంటే కష్టం. మాకే కాదు సాంకేతిక నిపుణులకూ అంతే! తమిళ్, తెలుగులో కూడా 9 టు 6 ఉంది. కానీ మలయాళం, హిందీలో 12 గంటలు చేయాలి. మలయాళంలో విరామాలు కూడా ఉండవు. షెడ్యూల్స్ నిరంతరాయంగా ఉంటాయి. అది చాలా కష్టం. వాళ్లు కేవలం మూడు నాలుగు గంటలే పడుకుంటారు. తరుచూ ఇదే జరుగుతుంది. నేను అన్నీ చేస్తాను. కానీ, ఆరోగ్యం పరంగా చూసుకుంటే 9 టు 6 కరెక్ట్. ఎందుకంటే మనకు ఆహారంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం” అని చెప్పుకొచ్చింది.