calender_icon.png 5 August, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్ ఎవరు?

04-08-2025 01:35:05 AM

- ఆయనవల్లే నల్లగొండలో బీఆర్‌ఎస్ సర్వనాశనం

- ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు

- మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్లకే అలవాటు

- బీసీ రిజర్వేషన్ల కోసం నేటి నుంచి 72 గంటల నిరాహార దీక్ష

- మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత  

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీలో లిల్లీపుట్ నాయకుడు ఉన్నారని, కేసీఆర్ లేకపోతే ఆయన లేడని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డనైన తనపైన కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారని, కానీ బీఆర్‌ఎస్ మాత్రం స్పందించ లేదని విమర్శించారు.

తనపై కొందరు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీఆర్‌ఎస్ పెద్దల హస్తం ఉందని, అందుకు తనపై కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, కానీ తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పరోక్షంగా జగదీశ్‌రెడ్డి, పటోళ్ల కార్తీక్ రెడ్డిపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో లిల్లీపుట్ నాయకుడు ఉన్నారని, కేసీఆర్ లేకపోతే ఆయన లేడన్నారు. తనపైన ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ సర్వనాశనం కావడానికి ఆయనే కారణమని, అక్కడ 11 నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి కారణం ఆయనే అని ఆరోపించారు. ఆ లిల్లీపుట్ నాయకుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే.. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన పిల్ల నాయకుడు కూడా ఎటుపడితే అటు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అసలు మీరు ఎవరు? తెలంగాణ ఉద్యమంతో మీకేం సంబంధం? మీ మీదనే కదా మేం కొట్లాడింది? పార్టీలో చేరి పదవులు దక్కగానే తిరిగి తన మీదనే మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రమేశ్ ఎందుకు వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, సీఎం రమేశ్ వ్యాఖ్యల వెనుక, తాను కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అవ్వడానికి సంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని, మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్లకే అలవాటు అని ఆరోపించారు.

నేటి నుంచి 72గంటల నిరాహార దీక్ష

బీసీ రిజర్వేషన్ల కోసం సోమవారం నుంచి 72 గంటల దీక్ష చేపడుతున్నట్టు కవిత తెలిపారు. తన దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల్లో 112 కులాలు ఉన్నాయని, తమకు సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు 40 కులాలకు మాట్లాడే అవకాశం ఉంటుందని, అన్ని కులాలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే కనీసం మూడు రోజులు పడుతుందన్నారు. అందుకే తెలంగాణ జాగృతి 72 గంటలు దీక్ష చేపడుతోందని పేర్కొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఆర్డినెన్స్‌పై బీజేపీ స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పార్లమెంట్‌లో మాట్లాడలేదని, వారు అడిగితే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వరా అని ప్రశ్నించారు.