04-08-2025 01:37:56 AM
- శత్రువులు వాడే పదాలనే కవిత వల్లెవేశారు
- గతంలో నల్లగొండ జిల్లాలో గెలుపునకు నేనే కారణమైతే..
- ఇప్పుడు ఓటమికి కూడా నేనే బాధ్యుడిని
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కేసీఆర్‌ను తాను ఈ మధ్యకాలంలో యాభైసార్లు కలిశానని, కవిత గురించి చర్చకు రాలేదని, వారి గురించి మాట్లాడటం వృథా అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తనపై ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. కేసీఆర్‌కు బద్దశత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి, ఓ మీడియా అధిపతి ఇటీవల ఏం మాట్లాడుతున్నారో.. కవిత అవే మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి, ఓ మీడియా అధిపతి పదాలనే కవిత ఉపయోగించారంటూ ఆరోపణలు గుప్పించారు. వారు ఉపయోగించిన పదాలను కవిత వల్లె వేశారన్నారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికున్న జ్ఞానానికి తన జోహర్లు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ప్రయత్నానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. తాను చావు తప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచానని, కానీ కొంతమంది గెలవలేదు కదా అని వ్యాఖ్యానించారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో గత 25 ఏళ్లలో జరిగిన ఉద్యమాలకు, గెలుపునకు తానే కారణమైతే.. ఇప్పుడు ఓటమికీ కూడా తానే బాధ్యుడిని అని అన్నారు. కొంతమంది ఏదో చేస్తామని ఊహించుకుంటున్నారని, వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ అని చెప్పారు. పార్టీనే అంతిమంగా ఫైనల్ అని, తాను పార్టీకి సైనికుడిని అని స్పష్టం చేశారు.
కేసీఆర్‌తో బనకచర్ల, వ్యవసాయ రంగానికి అంశంపైనే చర్చించామన్నారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేమని, అందులో సందేహాం లేదని పేర్కొన్నారు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదనని, తాను చూసి ఉంటే స్పందించే వాడినని ఆయన అన్నారు.