29-12-2025 01:10:51 AM
ఉక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక
మాస్కో, డిసెంబర్ 28 : ఉక్రెయిన్ శాంతి చర్చలకు మోగ్గుచూపకపోతే ‘ప్రత్యేక సైనిక చర్య’ చర్య తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. లక్ష్యాలన్నింటినీ బలప్రయోగం ద్వారానే సాధిస్తా మని హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ పాలకులకు శాంతియుత మార్గంలో వివాదాన్ని పరిష్కరించుకోవడం ఇష్టం లేదన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే రష్యా దళాలు ఉక్రెయిన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులకు తెగబడ్డాయి. శనివారం రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో సు మారు 500 డ్రోన్లు, 40 క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఈ భీకర దాడిలో ఒకరు మృతి చెందగా, 27మంది గాయపడ్డారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదనడానికి ఈ 10 గంటల విధ్వంసమే నిదర్శనమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలికే మార్గాలను వెతకడానికి జెలెన్‌స్కీ ఆదివారం అమెరికాలో డొనాల్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.
అమానవీయమైనవి : కెనడా
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులను కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఖండించారు. ఈ దాడులను ‘అమానవీయమైనవి’గా అభివర్ణించారు. శాంతి స్థాపన జరగా లంటే రష్యా సహకారం అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం కెనడా ప్రభుత్వం 2.5 బిలియన్ కెనడియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.