23-01-2026 04:47:33 PM
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కీరణ్మయికి వినతి పత్రం అందజేత
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లోని బూర్నాపూర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ భవన అక్రమ ఆక్రమణ లను అరికట్టాలని అక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డా. బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు మాట్లాడుతూ... బుర్నాపూర్ గ్రామంలోని ఎస్.సి కమ్యూనిటీ భవనం 1989 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ కాలంలో అప్పటి సర్పంచ్ శ్రీ సంతోని సాయిలు షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్.సి) సమాజం కోసం మాత్రమే నిర్మించి అధికారికంగా అప్పగించినదని తెలిపారు.
ఈ భవనం ఎస్సి కమ్యూనిటీదేనని స్పష్టం చేసేలా అప్పటి సర్పంచ్ జారీ చేసిన లీగల్ అఫిడవిట్ కూడా ఉన్నదని నాయకులు వివరించారు. అయితే, ప్రస్తుతం కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ భవనాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఎస్సి ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ, దౌర్జన్య ప్రవర్తనకు పాల్పడుతున్నారని, దీని వల్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఎస్.సి కమ్యూనిటీ భవనానికి తక్షణ పోలీస్ రక్షణ కల్పించాలని,అక్రమ ఆక్రమణలకు ప్రయత్నించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు నిరోధక చర్యలు చేపట్టాలని వినతి పత్రం ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు మైశయ్య, అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షుడు దేశాయిపేట్ ప్రశాంత్ కుమార్, మాజీ AMC చైర్మన్ నర్సింలు, డివిజన్ ఉపాధ్యక్షుడు మన్నే చిన్న సాయిలు,డివిజన్ నాయకులు బేగరి డాక్టర్ సాయిలు మరియు బుర్నాపూర్ గ్రామఅంబేద్కర్ సంగం సభ్యులు యువకులు లక్ష్మణ్, కనగోల్ల రాములు, ప్రకాశ్ , బాబు రాజు పాల్గొన్నారు.