8 May, 2026 | 9:01 AM

హైదరాబాద్‌ భారీ వర్ష సూచన.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

31-08-2024 11:09 AM

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాలలో  శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నేడు ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

బఫర్ జోన్లు, చెరువులకు సమీపంలో ఉన్న కాలనీ వాసులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వాన నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. రోడ్లు జలమయం అవుతాయని, చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతాయని తెలిపింది. 

కాగా, గత రాత్రి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ ఉదయం 8.30 గంటల సమయానికి హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాంతంలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బీహెచ్ఈఎల్‌లో 15.5 మిల్లీమీటర్లు, గచ్చిబౌలిలో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.