27-07-2025 08:24:36 PM
సూర్యాపేట (విజయక్రాంతి): తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్(Former MP Boora Narsaiah Goud) అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్డు వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య గౌడ్, బూర రాజమ్మల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి, తనను చదివించారని, వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
సమాజానికి సేవ చేయడం ద్వారా వారి ఆశయాలను నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారని, వారి కోరిక తీరే విధంగా పిల్లలు కష్టపడి చదివి జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోవాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఉత్తమ పౌరులుగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, మాజీ అధికార ప్రతినిధి బూర మల్సూరు గౌడ్, బిజెపి నాయకులు కడియం రామచంద్రయ్య,మన్మధ రెడ్డి,చల్లమల్ల నరసింహ,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.