calender_icon.png 19 November, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక జైల్లో అగరబత్తి తయారీ యూనిట్ ప్రారంభం

19-11-2025 07:26:20 PM

ప్రారంభించిన డీజీ ప్రిజన్స్,సీఎస్ సౌమ్య మిశ్రా 

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలో ఉన్న ప్రత్యేక ఉపజైలులో నూతన అగరు బత్తి తయారీ యూనిట్ ను తెలంగాణ జైళ్ల శాఖ శ్రీకారం చుట్టి బుధవారం  లాంచనంగా ఆరంభించింది. యూనిట్ ను ముఖ్య అతిథిగా హాజరైన డీజీ ప్రిజన్స్, సీఎస్ డాక్టర్ సౌమ్య మిశ్రా యూనిట్ ప్రారంభించారు. భద్రాచలం పట్టణానికి చేరుకున్న ఆమె ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించారు. అనంతరం ప్రత్యేక జైలు వద్దకు చేరుకున్నారు. జైలు వద్దకు చేరుకున్న సౌమ్య భద్రాచలం జైలు సూపరిండెంట్ జిడుగు ఉపేందర్, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

అదేవిధంగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ...  పవిత్ర భద్రాచల దేవస్థానాల్లో ప్రతిరోజూ సమర్పించే పుష్పాలను సేకరించి, వాటిని బొగ్గు లేకుండా పర్యావరణహిత అగరుబత్తులుగా మార్చడం ఈ యూనిట్ ప్రత్యేకత అని, దేవాలయ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణతోపాటు ఖైదీలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించేందుకు ఈ నమూనా దోహదం చేస్తుందని  జైళ్లు కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా, పరివర్తన, నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆశల కేంద్రాలు కావాలని ఉద్ఘాటించారు.

దేవాలయాల్లో విస్తారంగా ఏర్పడే పుష్ప వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చే వేస్ట్ టు వెల్త్' కార్యక్రమం, ఖైదీలకు నైపుణ్యాలు నేర్పుతూ స్వీయ అభివృద్ధికి దారితీయగల మార్గం అని పేర్కొన్నారు. ఖైదీల సమాజంలో తిరిగి బాధ్యతాయుత సభ్యులుగా మారేందుకు అవసరమైన శిక్షణ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే జైళ్ల శాఖ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.. భద్రాచలంలో ఈ పర్యావరణహిత యూనిట్ ను ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందిస్తూ, ఇలాంటి స్థిరమైన పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు.

జిల్లా జైలు, కరీంనగర్లో ప్రారంభించిన పైలట్ యూనిట్ ఇప్పటికే విశేష ఫలితాలు సాధించిందని తెలియజేశారు. ఆ యూనిట్ ద్వారా ఖైదీలలో క్రమశిక్షణ, పనిపై బాధ్యత, ప్రవర్తనలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపించాయని తెలిపారు. భద్రాచలం యూనిట్ కూడా ఇదే నమూనాను అనుసరిస్తూ, ఖైదీలకు శ్రద్ధతో కూడిన శిక్షణ, నిరంతర పని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని, రిఫార్మేషన్, రిహాబిలిటేషన్, రీసోషలైజేషన్ అనే మూడు ముఖ్యస్తంభాలను మరింత బలోపేతం చేయడమే ఈ యూనిట్ ఉద్దేశమని వెల్లడించారు.