calender_icon.png 8 August, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఒత్తిడి పెంచండి

08-08-2025 12:26:43 AM

  1. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు సీఎం రేవంత్ వినతి
  2. బీసీ పోరుబాట ధర్నా... ఇతర కార్యక్రమాలపై చర్చ

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులతో కలిసి గురువారం సమావేశమయ్యారు.

రాష్ర్టంలో కుల సర్వే తీరు.. తర్వాత  రాష్ర్ట శాసనసభలో బిల్లుల ఆమోదం విషయాలను ఖర్గేతో పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్ తదితరులకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు  వివరించారు. రాష్ర్టంలో రిజర్వేషన్ల సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు.

బిల్లుల ఆమోదం కోరుతూ తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైైర్మన్‌లు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో జంతర్‌మంతర్‌లో బుధవారం రోజంతా ధర్నా నిర్వహించిన విషయాన్ని, ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపినట్టు ఖర్గేకు వివరించారు.

సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా  సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.