13-08-2024 01:44:58 AM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. హిండెన్‌బర్గ్- అదానీ వ్యవహారం మరోసారి చర్చకు రావడంతో ఆ ప్రభావం సూచీలపై పడింది. ఆరంభంలో దీని ప్రభా వం ఎక్కువగా ఉన్నప్పటికీ.. తర్వాత సూచీ లు కోలుకున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఆఖర్లో కాస్త అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 79,330.12 పాయింట్ల (క్రితం ముగింపు 79,705.91) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు 500 పాయింట్ల మేర నష్టాల్లోకి జారుకున్న సూచీ.. 79,226.13 వద్ద కనిష్ట్ఠాన్ని తాకింది. తర్వాత కోలుకుని లాభాల్లోకి వచ్చింది. 80,106 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 56 పాయింట్ల నష్టంతో 79,648.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 20.50 పాయింట్ల నష్టంతో 24,347 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84గా ఉంది.
సెన్సెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 80.36 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2,482 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఓలా షేర్ల ర్యాలీ
గత వారం లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్లో పరుగులు తీశాయి. ఏకంగా 19.99 శాతం లాభంతో రూ.109.41 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద ముగిశాయి. శుక్రవారం ఫ్లాట్‌గా లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ షేరు రూ.91.18 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
అదానీ షేర్లకు హిండెన్‌బర్గ్ వేడి
హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణల నేపథ్యంలో ఓ దశలో భారీగా కుంగిన అదా నీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఇంట్రాడేలో చాలా వరకు రికవరీ అయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్ గరిష్ఠంగా 4.2 శాతం మేర నష్టపోగా.. మిగిలిన కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్ షేర్లు స్వల్పంగా లాభపడడం గమనార్హం.