08-07-2025 12:00:00 AM
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
రియో డి జెనిరో, జూలై 7: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా ఖండించారు. బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ సోమవారం ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని పేర్కొన్నారు. ఈ రెండింటిని ఒకే త్రాసులో తూకం వేయలేమన్నారు.
ఉగ్రవాదులకు మౌనంగా మద్దతు ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పహల్గాం ఉగ్రదా డిని బ్రిక్స్ కూటమి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ‘రియో డీ జెనిరో డిక్లరేషన్’ను సభ్య దేశాలు విడుదల చేశాయి. అనంతరం మోదీ బొలివియా, ఉరుగ్వే అధ్యక్షులతో పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు.