calender_icon.png 8 July, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడుల సమయంలో ముంబైలోనే ఉన్నా

08-07-2025 12:00:00 AM

  1. డేవిడ్ హెడ్లీతో కలిసి శిక్షణ పొందా
  2. పాక్ ఆర్మీకి నమ్మిన బంటును
  3. ఎన్‌ఐఏ కస్టడీలో ఒప్పుకున్న తహవ్వుర్ రాణా

న్యూఢిల్లీ, జూలై 7: ముంబై 26/11 ఉగ్రదాడుల కేసులో కీలక సూత్రదారిగా ఉన్న తహవ్వుర్ హుస్సేన్ రాణా ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కస్టడీలో విస్తుపోయే నిజాలు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ‘ముంబై దాడుల సమయంలో ముంబైలోనే ఉన్నా. పాకిస్థాన్ ఆర్మీకి నమ్మిన బంటును’ అని ఎన్‌ఐఏ విచారణలో రాణా ఒప్పుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

న్యూఢిల్లీలోని తిహర్ జైలులో ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న రాణా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణ సమయంలో పలు సంచలన విషయాలు చెప్పాడు. దాడుల మాస్టర్ మైండ్, తన మిత్రుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి ఎలా సహయపడింది.. ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినస్ వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా గుర్తించడంలో హెడ్లీకి సహకరించిన విధానాన్ని రాణా అంగీకరించినట్టు వెల్లడించాయి.

దాడులకు ముందు ప్రణాళికలో భాగంగా తన సంస్థకు చెందిన ఇమ్మిగ్రేషన్ సెంటర్‌ను ముంబైలో ప్రారంభించేందుకు నగరానికి వచ్చినట్టు అందులో భాగంగా పలు ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు ఒప్పుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సెంటర్ ప్రారంభించాలనే ఆలోచన తనదేనని రాణా అంగీకరించినట్టు తెలుస్తోంది.

హెడ్లీతో కలిసి శిక్షణలో పాల్గొన్నా.. 

‘ముంబై దాడుల మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీతో కలిసి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే  అనేక శిక్షణ సెషన్లలో పాల్గొన్నా. 1986లో రావల్పిండిలోని ఆర్మీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. ఆ తర్వాత క్వెట్టాలోని పాక్ సైన్యంలో కెప్టెన్ డాక్టర్ హోదాలో పని చేశా. సింధ్, బలోచిస్తాన్, బహవల్‌పూర్, సియాచిన్ వంటి సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించా.

సియాచిన్‌లో పని చేస్తున్నపుడు అనారోగ్యం కారణంగా విధులకు హాజరుకాకపోతే తాను పారిపోయినట్టుగా సైన్యం ప్రకటించింది. ఈ రికార్డును సరిచేయిస్తానని హెడ్లీ హామీ ఇవ్వడంతోనే ఉగ్రకుట్రలో భాగమయ్యా. ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా మొదలైన సంస్థలతో చురుగ్గా సమన్వయం చేసుకున్నా. ముంబై దాడులు మాత్రమే కాకుండా గల్ఫ్ యుద్ధంలో కూడా పాకిస్థాన్ సైన్యం సౌదీ అరేబియాకు పంపింది.

కెనడాలో స్థిరపడకముందు జర్మనీ, యూఎస్, బ్రిటన్‌లలో కూడా జీవనం సాగించా. అనంతరం కెనడాలో మీట్ ప్రాసెసింగ్, రియల్ ఎస్టేట్, గ్రాసరీస్ బిజినెస్‌లో స్థిరపడ్డా’ అని విచారణలో వెల్లడించాడు.

పాక్‌కు చెందిన కెనడా జాతీయుడైన 64 ఏండ్ల తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా భారత్‌కు అప్పగించింది. అప్పటి నుంచి రాణా ఎన్‌ఐఏ కస్టడీలోనే ఉన్నాడు. ముంబై పోలీసులు రాణాను వీలైనంత త్వరగా తమ కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో 166 మంది చనిపోయారు.