17-08-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 16: భారత్ అంచనాల్ని మించి వృద్ధి సాధిస్తున్నదని, 2027 కల్లా ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నట్టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఎంఎఫ్‌ఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ చెప్పారు. ఒక ఆంగ్ల న్యూస్ ఛానల్‌తో గోపీనాథ్ మాట్లాడుతూ వివిధ సానుకూల అంశాల ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం తమ అంచనాల్ని భారత్ వృద్ధి రేటు మించిందని, ఆ ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిపై తమ అంచనాలు పెరుగుతున్నాయన్నారు.
ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, ద్విచక్ర వాహన విక్రయ గణాంకాలు ఆధారంగా చూస్తే దేశంలో ప్రైవేటు వినియోగం రికవరీ అవుతున్నట్లు కన్పిస్తున్నదని, ఇందు కు సానుకూల రుతుపవనాలు కూడా తోడైనందున ప్రస్తుత 2024 ఆర్థిక సంవ త్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాల్ని ఐఎంఎఫ్ 7 శాతానికి పెం చిందని గోపీనాథ్ వివరించారు. ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 6.5 శాతం వృద్ధి అంచనాల్ని మించి ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థ పట్ల మరింత బుల్లిష్‌గా ఉన్నది. ఈ నేపథ్యంలో 2027కల్లా ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది.
పెరుగుతున్న వినియోగం
గతఏడాది భారత్‌లో ప్రైవేటు వినియో గం 4 శాతం వృద్ధిచెందిందని, ఈ ఏడాది మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నామని ఐఎంఎఫ్ అధికారి చెప్పారు. గ్రామీణ వినియోగం రికవరీ అవుతున్నదన్నారు. ద్విచక్ర వాహన విక్రయాల్ని చూసి నా, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ అ మ్మకాల్ని పరిశీలించినా వినియోగం పెరుగుదల స్పష్టంగా కన్పిస్తున్నదన్నారు.
రుతుపవనాలు బాగున్నందున, మెరుగైన పంట దిగుబడులు వస్తాయని తాము భావిస్తున్నామని, దీంతో వ్యవసాయ ఆదాయాలు పెరిగి గ్రామీణ వినియోగం వృద్ధిచెందుతుందని గీతా గోపీనాథ్ వివరించారు. తాము భారత్ వృద్ధి రేటును 7 శాతానికి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ రెండు అంశాలు కారణమని చెప్పారు.