22-09-2025 08:04:11 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): భక్తి శ్రద్ధలతో విజయదశమి జరుపుకోవాలని డీఎస్పీ చంద్రబాను అన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణం మండలంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దుర్గాదేవి మండప నిర్వాహకులతో ఇల్లందు సోమవారం స్థానిక ఇల్లందు పోలీస్ స్టేషన్ లో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు నిర్వహించే పూజా కార్యక్రమాల సందర్భంగా పలు సూచనలు సలహాలు చేశారు. భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎలాంటి వర్గ విభేదాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా మత సామరస్యాన్ని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు.
మండపం వద్దకు వచ్చే ప్రతి భక్తుడు మహిళలు పిల్లల పట్ల సోదర భావంతో మెలగాలన్నారు. పోలీస్ నిర్ణయించిన సమయం మేరకు రాత్రి 9గంటల లోపే జెమిని గ్రౌండ్ వద్దకు వారి ఊరేగింపు విగ్రహాలను చేర్చాలన్నారు. డిజె సౌండ్ బాక్స్ ను నిషేధించడం జరిగిందని సాధారణ సౌండ్ బాక్స్ లతో ఊరేగింపుగా ఎవరికి ఇబ్బందులు కలవకుండా జెకె కాలనీలో నిర్వహించే దసరా ఉత్సవాల వద్దకు వారి ఉత్సవ విగ్రహాలను చేర్చుకొని ప్రశాంతంగా ఇంటికి తిరిగి వెళ్లాలన్నారు. వాతావరణ పరిస్థితులు సైతం అనుకూలంగా లేవని దీని దృష్ట్య ప్రజలు నిర్వహకులు భక్తులు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పట్ల చర్యలు తప్పమన్నారు. ప్రతి మండపం వద్ద పోలీస్ గస్తీ ఉంటుందని ఎలాంటి అవాంఛనీయ ఘర్షణ సంఘటన చోటు చేసుకున్న దీనికి పూర్తి బాధ్యులు మండపం నిర్వాహకులేనన్నారు.