calender_icon.png 15 August, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మోదీ హయాంలో భారత్ సూపర్‌పవర్

15-08-2025 01:16:20 AM

  1. ప్రతీ గుండెలో దేశభక్తిని నింపిన ‘హర్ ఘర్ తిరంగా’

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

నెక్లెస్ రోడ్‌పై రెపరెపలాడిన జాతీయజెండాలు

‘తిరంగా యాత్ర’ను జెండా ఊడి ప్రారంభించిన కమలాధ్యక్షుడు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ నాయక త్వంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతీ పౌరుడిలో దేశభక్తి, జాతీయవాదం ఉండాలని పేర్కొన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం అంబరాన్నంటింది.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌తోపాటు, కూకట్‌పల్లిలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జంట నగరాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. జాతీయ జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నెక్లెస్ రోడ్‌ను హోరెత్తించారు.

ఈ సందర్భంగా రాంచందర్‌రావు మా ట్లాడుతూ.. ప్రధాని మోదీ పిలుపుతో చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతీ పౌరుడిలో దేశభక్తిని నింపుతోందని పేర్కొన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశ ఐక్యత, గౌరవం, సమగ్ర తను చాటిచెప్పినట్టవుతుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతీ పౌరుడిలో దేశభక్తి, జాతీయవాదం ఉండాలని ఉద్ఘాటించారు.

తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలు తమ దేశభక్తిని చాటుకుంటున్నారని చెప్పారు. వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల పునాదులపై మన దేశం నిలబడిందని, వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు.

‘మతం ఆధారంగా మన దేశాన్ని విడగొట్టి, మన సంపదను దోచుకున్న బ్రిటిషర్లకు, పాకిస్థాన్‌కు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది’ అని రాంచందర్ రావు ఆరోపించారు. మరోసారి దేశ విభజనకు ఆస్కారం ఇవ్వకూడదని, ఆ సంకల్పంతోనే భారతదేశ ఐక్యత, సమగ్రత, సంస్కృతిని కాపాడేందుకు ఈ తిరంగా యాత్ర ద్వారా ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.