22-07-2025 08:29:15 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన మలిదశ ఉద్యమకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చలో గన్ పార్క్ కార్యక్రమం చేపట్టగా దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ కు వెళ్లకుండా పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ కొలుగూరి విజయ్ కుమార్(District Convener Koluguri Vijay Kumar)ను ముందస్తుగా అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమకారులకు స్వాతంత్ర సమరయోధులతో సమాన గౌరవం, హక్కులు కల్పించి, ప్రత్యేక పెన్షన్, 300 గజాల ఇంటి స్థలం ఇంటి నిర్మాణం కోసం దళిత బంధు తరహాలో 10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించి, ఉద్యోగ విద్యా రంగాలలో ఉద్యమ కారుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించా లని, తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధి మంజూరు చేయడంతో పాటు ఉద్యమ కారులనే చైర్మన్ డైరెక్టర్లుగా తె నియమించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం అప్పటి పిసిసి అధ్యక్షునీ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ ఎన్నికలలో పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కీలక పాత్ర పోషించామని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఉద్యమ కారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.