12-01-2026 01:43:42 AM
అదరగొట్టిన కింగ్
తొలి వన్డేలో భారత్ విజయం
రాణించిన గిల్ , శ్రేయాస్, రాణా
సిరీస్‌లో భారత్‌కు 1 ఆధిక్యం
కొత్త ఏడాదిలోనూ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ కొనసాగించిన వేళ.. గిల్, శ్రేయాస్ అయ్యర్ సమయోచిత ఇన్నింగ్స్‌లు, చివర్లో హర్షిత్ రాణా మెరుపులు.. వెరసి తొలి వన్డేలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. కింగ్ సెంచరీ చేజారినా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితోనే బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను ముగించి ప్రశంసలు అందుకున్నాడు. ఫలితంగా భారత్ సిరీస్‌లో 1 ఆధిక్యాన్ని అందుకుంది.
వడోదర , జనవరి 11 : తొలి వన్డేలో ఊహించినట్టుగానే భారత్ కీలక మార్పులతో బరిలోకి దిగింది. శ్రేయాస్ అయ్యర్, సిరాజ్ జట్టులోకి తిరిగి రాగా , నితీష్ కుమార్‌రెడ్డికి చోటు దక్కలేదు. టాస్ గెలిచిన గిల్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అటు కుర్రాళ్లతో ఆడిన న్యూజిలాండ్ ఆకట్టుకుంది. భారత బౌలర్లు ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పైగా క్యాచ్‌లు జారవిడవడంతో కివీస్ ఓపెనర్లు సద్వినియోగం చేసుకుని మంచి ఆరంభాన్నిచ్చారు. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోలస్ (62) దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన కాసేపటికే మరో మూడు వికెట్లు తీసి భారత్ పైచేయి సాధించింది.
విల్ యంగ్(12)ను సిరాజ్ ఔట్ చేస్తే, ఫిలిప్స్ (12)ను కుల్దీప్ యాదవ్, మిఛెల్ హే(18)ను ప్రసిద్ధ కృష్ణ పెవిలియన్‌కు పంపాడు. దీంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో డారిల్ మిఛెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ బ్రేస్‌వెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రేస్‌వెల్‌ను శ్రేయాస్ రనౌట్ చేసిన తర్వాత జాక్ ఫోల్క్స్ కూడా త్వరగానే వెనుదిరిగాడు. అయితే మిఛెల్ తన దూకుడు కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్న మిఛెల్‌ను ప్రసిధ్ధ కృష్ణ ఔట్ చేయగా.. చివర్లో భారత బౌలర్లు పట్టువిడవడం కివీస్‌కు కలిసొచ్చింది. కైల్ జెమీ సాయంతో క్లిస్టియన్ క్లార్క్ (24) మెరుపులు మెరిపించాడు.ఫలితంగా న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్యఛేదనలో భారత్‌కు ఓ మోస్తారు ఆరంభం లభించింది. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ, గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 39 రన్స్ మాత్రమే జోడించగలిగాడు. కొన్ని మెరుపు షాట్లు ఆడిన హిట్ మ్యాన్ 26(3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభమన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ కివీస్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. గిల్ ఆచితూచి ఆడినా కోహ్లీ మాత్రం తనదైన క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు కోహ్లీ, గిల్ 118 పరుగులు జోడించారు. గిల్ 56 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్‌కు ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ తన దూకుడు కొనసాగించాడు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న కోహ్లీ 93(8 ఫోర్లు, 1 సిక్స్) పరుగులకు ఔటవగా.. ఇక్కడ నుంచి భారత్ మరో 2 వికెట్లు కోల్పోయింది. జడేజా (4), శ్రేయాస్ అయ్యర్ (49) రన్స్‌కు ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో హర్షిత్ రాణాకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్ ప్రయోగం ఫలించింది. రాణా బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. ధాటిగా ఆడిన రాణా 29(2 ఫోర్లు, 1 సిక్స్) ఔటవగా.. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితోనే బ్యాటింగ్ చేస్తూ రాహుల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. రాహుల్ నిలకడగా ఆడుతూ మ్యాచ్‌ను ముగించాడు. దీంతో భారత్ మరో ఓవర్ మిగిలుండగానే టార్గెట్‌ను అందుకుంది. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 4 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 300/8 ( మిఛెల్ 84, నికోలస్ 62 , కాన్వే 56 ; సిరాజ్ 2/40, రాణా 2/65. ప్రసిద్ధ కృష్ణ 2/60)
భారత్ ఇన్నింగ్స్: 306/6 (49 ఓవర్లు) ( కోహ్లీ 93, గిల్ 56, శ్రేయాస్ 29, రాణా 29; జేమీసన్ 4/41)